Malla Reddy: అమెరికాలో ఉన్న రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్ తో నన్ను చంపాలని ప్రయత్నించాడు: మంత్రి మల్లారెడ్డి ఫైర్

Will send Revanth Reddy to Jail says minister Malla Reddy
  • పాత గొడవలను మనసులో పెట్టుకుని రేవంత్ తనపై దాడి చేయించారన్న మల్లారెడ్డి 
  • రెడ్ల ముసుగులో రాజకీయ పంచాయతీలు చేస్తున్నారని ఆరోపణ 
  • రేవంత్ ను జైలుకు పంపిస్తామన్న మంత్రి 

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి, తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి ముందు నుంచీ కూడా విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. నిన్న మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో జరిగిన 'రెడ్ల సింహగర్జన' సభ వీరిద్దరి మధ్య వైరానికి మరింత ఆజ్యం పోసింది. సభలో ప్రసంగిస్తున్న మల్లారెడ్డిని కొందరు అడ్డుకున్నారు. ఈ క్రమంలో, ఆయన ప్రసంగాన్ని మధ్యలో ఆపేసి... అక్కడి నుంచి వెళ్తుండగా, ఆయన వాహనంపై చెప్పులు, కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరారు. 

ఈ నేపథ్యంలో, ఈ రోజు మల్లారెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనను హత్య చేసేందుకు రేవంత్ రెడ్డి కుట్ర పన్నారని ఆరోపించారు. రెడ్ల సింహగర్జన సభకు తాను ప్రభుత్వం తరుపున వెళ్లానని... తనపై రేవంత్ అనుచరులు దాడికి పాల్పడ్డారని అన్నారు. రేవంత్ కుట్రలను బయట పెడతామని... జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. రెడ్ల ముసుగులో రేవంత్ రాజకీయపరమైన పంచాయతీలు చేస్తున్నారని... ఆయన వ్యవహారశైలిని తమ పార్టీ, ప్రభుత్వం గమనిస్తోందని చెప్పారు. రేవంత్ రెడ్డి ఒక్కడే రెడ్డా? మేము రెడ్లం కాదా? అని మండిపడ్డారు. 

రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలింగ్ ను బయటపెట్టినందుకే ఇదంతా చేస్తున్నాడని మల్లారెడ్డి అన్నారు. రెడ్ల ముసుగులో గూండాలను పంపి తనను చంపాలని ప్రయత్నించారని చెప్పారు. అమెరికాలో ఉన్న రేవంత్ పక్కా ప్లాన్ ప్రకారమే ఇదంతా చేయించారని అన్నారు. పాత గొడవలను మనసులో పెట్టుకుని ఇదంతా చేస్తున్నారని చెప్పారు. రెడ్లకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని ఈ సభ ద్వారా అడగాలని అనుకున్నామని... ఈ సభకు టీఆర్ఎస్ లో ఉన్న రెడ్డి నాయకులందరినీ పిలిచామని తెలిపారు. తనపై దాడికి పాల్పడిన వారిపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.

  • Loading...

More Telugu News