Tiger: కాకినాడ జిల్లాలో పెద్దపులి కలకలం... హడలిపోతున్న ప్రత్తిపాడు మండల ప్రజలు

  • గత కొన్నిరోజులుగా పులి సంచారం
  • ఆరు గేదెలను చంపేసిన వైనం
  • 120 మంది సిబ్బందిని రంగంలోకి దించిన అటవీశాఖ
  • పులిని బంధించేందుకు ప్రత్యేక కార్యాచరణ
Tiger spotted in Kakinada district

ఇటీవల కాలంలో వన్య మృగాలు జనావాసాల్లోకి రావడం సాధారణంగా మారింది. తాజాగా, కాకినాడ జిల్లాలో ఓ పెద్దపులి కలకలం రేపుతోంది. ఆ పులి పశువులను చంపేస్తుండడంతో అనేక గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈ పెద్ద పులి ప్రత్తిపాడు మండలంలో సంచరిస్తున్నట్టు గుర్తించారు. పొదురుపాక, ఒమ్మంగి, ధర్మవరం, శరభవరం గ్రామాల్లో 6 గేదెలను చంపేసింది.

దీంతో, అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు 120 మంది సిబ్బందిని రంగంలోకి దించారు. అటవీశాఖ అధికారి శరవణన్ నేతృత్వంలో పులిని బంధించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. పులిని పట్టుకోవడానికి భారీ సంఖ్యలో బోన్లను ప్రత్తిపాడు మండలంలోని వివిధ గ్రామాలకు తరలిస్తున్నారు. పులిని త్వరగా బంధించాలని ఆయా గ్రామాల ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. 

కాగా, ఆ పెద్దపులి తాగునీటి కోసం గ్రామాల సమీపంలో ఉన్న కాల్వల వద్దకు వస్తోందని, రాత్రివేళల్లో గ్రామాల్లోని పశువులపై దాడి చేస్తోందని అధికారులు గుర్తించారు.

More Telugu News