Andhra Pradesh: ఒక్క చాన్స్ అనగానే ఓటేసి తప్పు చేశారు.. అనుభవిస్తున్నారు: నందమూరి బాలకృష్ణ

You Should Introspect Balakrishna Asks Public
  • ఇకనైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరిన బాలకృష్ణ 
  • ఈ ప్రభుత్వం గుడి, గుడిలోని లింగాన్నీ మింగేసే రకమని మండిపాటు
  • తెలుగువారికి ఏ ఆపద వచ్చినా ఎన్టీఆర్ ముందుండేవారని కామెంట్
ఇప్పుడున్న ప్రభుత్వం గుడిని, గుడిలోని లింగాన్ని మింగే రకమని టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. ఏపీలోని తెనాలిలో ఉన్న పెమ్మసాని థియేటర్ లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అని గురజాడ అప్పారావు అన్నారని, కానీ, దానికి పూర్తి వ్యతిరేకంగా రాష్ట్ర పరిస్థితి ఉందని విమర్శించారు. 

ఒక్క చాన్స్ అని అడగ్గానే ఒక్క తప్పు చేసి ఓటు వేసి అనుభవిస్తున్నారని, ఇకనైనా అందరూ ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. ఒకప్పుడు ఎక్కడున్నాం? ఇప్పుడు ఎక్కడున్నాం? అని ప్రశ్నించుకోవాలన్నారు. 

సామాన్య రైతు కుంటుంబంలో పుట్టి, ప్రభుత్వ ఉద్యోగిగా ఎదిగి, సినిమా రంగంలోకి ప్రవేశించి మహానటుడిగా లక్షలాది మంది హృదయాల్లో తాను దైవంగా భావించే ఎన్టీఆర్ సుస్థిర స్థానం సంపాదించుకున్నారని బాలకృష్ణ పేర్కొన్నారు. తెలుగు వారికి ఏ ఆపద వచ్చినా ఆయన ముందుండే వారన్నారు. నాడు సీమ ప్రజలు కరవుతో ఇబ్బందిపడితే జోలెపట్టిన గొప్ప సంస్కర్త అని కొనియాడారు. దివిసీమ ఉప్పెన సమయంలోనూ.. దేశ సరిహద్దుల్లో సైనికుల కోసం నిధిని ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. 

తెలుగు జాతి విలువలు పతనమైపోతున్న తరుణంలో.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్న రోజుల్లో బడుగు, బలహీన వర్గాల కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టి సింహంలా పోరాడిన వ్యక్తి అన్నారు. బడుగువారిని అధికార పీఠంపై కూర్చోబెట్టిన మహానుభావుడు ఎన్టీఆర్ అని అన్నారు. రెండు రూపాయలకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పేదోడికి ఇల్లు.. తదితర ఎన్నో సంస్కరణలను ఎన్టీఆర్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. 

కాగా, పెమ్మసాని థియేటర్ లో ఏడాది పొడవునా రోజూ ఎన్టీఆర్ సినిమాను ప్రదర్శిస్తారని, ఒక షోను ఉచితంగా వేస్తారని బాలకృష్ణ చెప్పారు. నెలకోసారి సినీ కార్మికులకు అవార్డులను ప్రదానం చేస్తారని ఆయన పేర్కొన్నారు.
Andhra Pradesh
Telugudesam
Balakrishna
NTR

More Telugu News