Chhattisgarh: ఈ రైలు చాలా లేట్ గురూ.. ఏడాది ఆలస్యంగా గమ్యానికి చేరుకున్న గూడ్సురైలు!

Train carrying food grains takes a year to reach destination
  • గతేడాది మే నెలలో చత్తీస్‌గఢ్ నుంచి బయలుదేరిన రైలు
  • రైలు నిర్ణీత సమయానికి బయలుదేరకపోవడంతో దాని గురించే మర్చిపోయిన అధికారులు
  • తీరిగ్గా ఈ నెల 17న స్టేషన్‌కు చేరిన వైనం
  • పాడైపోయిన బియ్యం లోడు
భారతీయ రైళ్లు నిర్ణీత సమయానికి వచ్చిన సందర్భాలు చాలా అరుదు. నిన్నలేదు మొన్న మధ్యప్రదేశ్‌లో ఓ రైలు రావాల్సిన సమయానికంటే 20 నిమిషాలు ముందుగా రావడంతో ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. రైళ్లు ఆలస్యంగా వస్తాయని ఇప్పటికే డిసైడైపోయిన జనం ముందుగా రావడంతో ఆనందం పట్టలేక ప్లాట్‌ఫామ్‌పైనే డ్యాన్సులేశారు. 

నిజానికి రైళ్లు లేటుగా రావడం మనకు అత్యంత సాధారణ విషయమే అయినా, ఇప్పుడు చెప్పుకోబోయే రైలు ఎంత ఆలస్యంగా వచ్చిందో చెబితే మాత్రం నోరెళ్లబెడతారు. కేవలం 762 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు ఆ రైలుకు ఏకంగా ఏడాది పట్టింది. నమ్మశక్యంగా లేదు కదూ. అయినప్పటికీ నమ్మాల్సిందే. 

ఇక, అసలు విషయానికి వస్తే గతేడాది మే నెలలో చత్తీస్‌గఢ్‌లోని ఓ రైల్వే స్టేషన్‌ నుంచి ఓ గూడ్సు రైలు వెయ్యి బియ్యం బస్తాలతో ఝార్ఖండ్‌లోని న్యూ గిరిడీ స్టేషన్‌కు బయలుదేరింది. అయితే, సాంకేతిక కారణాలతో రైలు నిర్ణీత సమయానికి బయలుదేరలేదు.. ఆ తర్వాత ఆ రైలు గురించి అధికారులు మర్చిపోయారు. అలా ఏడాదిపాటు ఎండకు ఎండుతూ.. వానకు నానుతూ పట్టాలపైనే మగ్గిపోయిన ఆ రైలు ఎట్టకేలకు ఈ నెల 17న న్యూ గిరిడీ స్టేషన్‌కు చేరుకుంది. 

బోగీలోని సరుకును అన్‌లోడ్ చేసుకోవాలంటూ స్టేషన్ సిబ్బందికి సమాచారం అందింది. అయితే, షెడ్యూల్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా వచ్చిన రైలును చూసిన అధికారులు షాకయ్యారు. అందులోని బియ్యం బస్తాలు పూర్తిగా పాడైపోయిన స్థితిలో దర్శనమిచ్చాయి. దాదాపు 300 బస్తాల బియ్యం పాడైపోయినట్టు అధికారులు తెలిపారు. మిగతా బియ్యం కూడా పనికి వస్తాయో, రావో కచ్చితంగా చెప్పలేమని పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తామని న్యూ గిరిడీ స్టేషన్ మాస్టర్ పంకజ్ కుమార్ తెలిపారు.
Chhattisgarh
Jharkhand
New Giridih
Train
Goods Rail

More Telugu News