Gujarat minister: గొలుసులతో వీపుకేసి బాదుకున్న గుజరాత్ మంత్రి.. విమర్శలపై స్పందన

Not superstition says Gujarat minister as he flogs himself with chains Watch video
  • మూఢ నమ్మకాలను ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ విమర్శ
  • మూఢనమ్మకంగా పిలవొద్దన్న మంత్రి అరవింద్
  • తమ దేవతను ఆరాధించుకుంటున్నామని వివరణ
గుజరాత్ మంత్రి అరవింద్ రయాని వివాదంలో చిక్కుకున్నారు. మెటల్ గొలుసులతో ఆయన వీపుకేసి కొట్టుకుంటున్నట్టు ఒక వీడియో బయటకు వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో అది హల్ చల్ చేస్తుండడంతో, మంత్రి తన చర్యలతో మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఆయన స్పందిస్తూ, దీన్ని మూఢనమ్మకంగా పేర్కొనడం తప్పని చెప్పారు. నమ్మకాలకు, మూఢ నమ్మకాలకు మధ్య చాల పలుచటి గీతే ఉంటుందంటూ బీజేపీ సైతం అరవింద్ కు మద్దతుగా నిలిచింది. 

గురువారం రాజ్ కోట్ లో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో మంత్రి అరవింద్ పాల్గొన్నారు. అక్కడి దేవతా పూజలో భాగంగా ఆయన ఇనుప గొలుసులతో తనను తాను శిక్షించుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఒక వ్యక్తి కరెన్సీ నోట్లను వెదజల్లడాన్ని వీడియోలో చూడొచ్చు. ‘‘నా చిన్న నాటి నుంచి ఆ దేవతకు భక్తుడిని. మా స్వగ్రామంలో మా కుటుంబం కూడా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది. దీన్ని మూఢనమ్మకంగా పిలవొద్దు. మా దేవతను ఆరాధించుకుంటున్నాం అంతే’’ అని మంత్రి స్పష్టం చేశారు. 

కాంగ్రెస్ గుజరాత్ అధికార ప్రతినిధి మనీష్ దోషి స్పందిస్తూ మంత్రిగా ఉన్నప్పటికీ అశాస్త్రీయమైన చర్యలతో మూఢనమ్మకాలను వ్యాప్తి చేయడం దురదృష్టకరమని అభివర్ణించారు. ఇది వ్యక్తిగత మత విశ్వాసాలకు సంబంధించిందని బీజేపీ గుజరాత్ అధికార ప్రతినిధి యగ్నేష్ దవే వివరణ ఇచ్చారు.
Gujarat minister
arvind raiyani
superstition
iron chains

More Telugu News