YS Sharmila: మోదీ ఇక్కడికి వస్తే పిరికివాడిలా పారిపోయావా?: కేసీఆర్ పై షర్మిల విమర్శలు

YS Sharmila comments on KCR
  • నిన్న హైదరాబాదు వచ్చిన ప్రధాని మోదీ
  • అదే సమయంలో కేసీఆర్ బెంగళూరు పర్యటన
  • మీరెక్కడికి పారిపోయారంటూ ప్రశ్నించిన షర్మిల
  • జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారని వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్ర మోదీ నిన్న హైదరాబాదు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, మోదీ నగరానికి వచ్చిన సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ బెంగళూరు పర్యటనకు వెళ్లారు. దీనిపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. 

"ఢిల్లీ కోటలు బద్దలు కొడతాం, కడిగిపారేస్తాం, ఏకిపారేస్తాం అన్న కేసీఆర్ సారూ... మోదీ ఇక్కడకు వస్తే మీరెక్కడికి పారిపోయారు?" అంటూ షర్మిల ప్రశ్నించారు. "మా తెలంగాణ ధాన్యం ఎందుకు కొనవు? మద్దతు ధర ఎందుకు ఇవ్వవు అని ఏకిపారేయలేకపోయావా?" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. "పిల్లిని చూసి ఎలుక దాక్కున్నట్టు మోదీ గారొస్తే పిరికివాడి లాగా పారిపోయావా?" అంటూ ఎద్దేవా చేశారు. 

"కేసీఆర్ పాలన అవినీతిమయం అని మోదీ చెబుతారు. మోదీ అవినీతి చిట్టా తన దగ్గర ఉందని కేసీఆర్ చెబుతారు. కానీ, ఇద్దరూ ఎదురుపడరు, అవినీతిని బయటపెట్టరు. జనాన్ని మాత్రం పిచ్చోళ్లను చేస్తారు. మీవన్నీ ఉడుత ఊపుల ప్రసంగాలేనా? లేక, ఒకరి అవినీతిని ఒకరు బయటపెట్టకూడదని చీకటి ఒప్పందాలేమైనా చేసుకున్నారా?" అంటూ షర్మిల నిలదీశారు.
YS Sharmila
KCR
Narendra Modi
Hyderabad
Telangana

More Telugu News