Narendra Modi: ఓ కుటుంబ దోపిడీకి తెలంగాణ రాష్ట్రం బలవుతోంది: ప్రధాని మోదీ

PM Modi scathing attack on TRS high command
  • హైదరాబాద్ విచ్చేసిన ప్రధాని మోదీ
  • ఘనస్వాగతం పలికిన తెలంగాణ బీజేపీ నేతలు
  • బేగంపేట సభలో ప్రధాని ప్రసంగం 
  • టీఆర్ఎస్ అధినాయకత్వంపై మోదీ విమర్శలు  
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్ విచ్చేశారు. ప్రధానికి ఘనస్వాగతం పలికిన తెలంగాణ బీజేపీ నేతలు బేగంపేటలో స్వాగత సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. పట్టుదలకు, పౌరుషానికి మారుపేరు తెలంగాణ ప్రజలు అని అభివర్ణించారు. ఒక ఆశయం కోసం వేలమంది ప్రాణత్యాగం చేశారని కీర్తించారు. ఏ ఒక్క కుటుంబం కోసమో తెలంగాణ పోరాటం జరగలేదని పేర్కొన్నారు. 

అయితే, ప్రస్తుతం ఒక కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయిందని వ్యాఖ్యానించారు. ఆ కుటుంబం అధికారంలో ఉండి దోచుకోవాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కుటుంబ పార్టీ స్వలాభం ఎలా ఉంటుందో ప్రజలు చూస్తున్నారని అన్నారు. పేదల సమస్యలు ఆ కుటుంబ పార్టీకి పట్టవని విమర్శించారు. తెలంగాణ అమరుల ఆశయాలు నెరవేరడంలేదని, యువత ఆకాంక్షలను సర్కారు పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు. కుటుంబ దోపిడీకి తెలంగాణ బలవుతోందని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆఖరికి ప్రభుత్వ పథకాల విషయంలోనూ రాజకీయాలు చేస్తున్నారని, కేంద్ర పథకాల పేర్లు మార్చి తెలంగాణలో అమలు చేస్తున్నారని ఆరోపించారు. పథకాల్లో రాజకీయాలు చేస్తే ప్రజలు నష్టపోతారని తెలిపారు. కేంద్ర పథకాల పేర్లు మార్చినా, ప్రజల మనస్సుల్లోంచి తమ పేర్లను తుడిచివేయలేరని స్పష్టం చేశారు.

తెలంగాణలో మార్పు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు ఆ దిశగా స్పష్టమైన సంకేతాలిస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో కొత్త చరిత్ర సృష్టిస్తామని, జెండా ఎగరేస్తామని విశ్వాసం వెలిబుచ్చారు. టీఆర్ఎస్ జూట్ నే వాలే... బీజేపీ జీత్ నే వాలే (టీఆర్ఎస్ అబద్ధాలు చెప్పే పార్టీ.... బీజేపీ గెలిచే పార్టీ) అంటూ నినదించారు. తెలంగాణను ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలనేది తమ ఆకాంక్ష అని వెల్లడించారు. తమ పోరాటం తెలంగాణ అభివృద్ధి కోసమని మోదీ ఉద్ఘాటించారు. 

తెలంగాణలో బీజేపీ శ్రేణులపై దాడుల విషయం తన దృష్టికి వచ్చిందని మోదీ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో నెగ్గేది, తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది బీజేపీయేనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల సామర్థ్యం తమకు తెలుసని, తెలంగాణను టెక్నాలజీ హబ్ గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. సర్దార్ పటేల్ దేశ ఐక్యత కోసం కృషి చేశారని, ఆయన ఆశయాలను బీజేపీ కార్యకర్తలు మరింత ముందుకు తీసుకెళ్లాలని ఉద్బోధించారు.

కుటుంబ పార్టీలు దేశానికి చేటు అని పేర్కొన్నారు. తెలంగాణను విచ్ఛిన్నం చేసేవారు నాడే కాదు, నేడు కూడా ఉన్నారని వెల్లడించారు. కుటుంబ పార్టీలు అధికారంలో ఉంటే అవినీతి పెరుగుతుందని వివరించారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం వచ్చిందని అన్నారు. 

టీఆర్ఎస్ ఓ పార్టీకి గులాంగా మారి పనిచేస్తోందని విమర్శించారు. 21వ శతాబ్దంలోనూ కొందరు మూఢవిశ్వాసాలు నమ్ముతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. మూఢ నమ్మకాలు తెలంగాణ అభివృద్ధికి అడ్డంకిగా మారాయని అన్నారు. మూఢ విశ్వాసాలను నమ్మిన సీఎంలు ఎక్కువకాలం ఉండరని స్పష్టం చేశారు. 

"గుజరాత్ లోని కొన్ని ప్రాంతాలకు వెళితే పదవి పోతుందని కొందరు అన్నారు. అయినా నేను నమ్మలేదు. అలాగే వెళ్లాను. ఏమీ కాలేదు. నేను టెక్నాలజీని నమ్ముతా... మూఢ నమ్మకాలను కాదు" అని మోదీ వివరించారు.
Narendra Modi
Prime Minister
Hyderabad
TRS
BJP
Telangana

More Telugu News