foods: అన్నీ మితంగా తింటేనే ఆరోగ్యం.. తాజా అధ్యయనం!

  • ఆహారం అన్నది వివిధ రకాల పదార్థాల కలయికగానే ఉండాలి
  • విడిగా ఏదో ఒక పండు లేదా పదార్థంతో వచ్చే అద్భుతాల్లేవు
  • దుష్ఫలితాలు కూడా ఉంటాయన్న పరిశోధకులు
Dont trust research that says a single superfood possesses magical health benefits

బ్లూబెర్రీస్ ని సూపర్ ఫుడ్ అని అనడం వినే ఉంటారు. రెడ్ వైన్ తీసుకోవడం గుండెకు మంచిదని.. ఇలా రకరకాల సూచనలు వింటుంటాం. మరి నిజానికి వాటితో అంత ప్రయోజనాలు లభిస్తాయా? అన్న సందేహం కలగక మానదు. అందుకే ఓ శాస్త్రవేత్తల బృందం ఇదే అంశంపై పరిశోధన నిర్వహించింది. 

ఆరోగ్యంపై మంచి లేదా చెడు ప్రభావాన్ని చూపించే ఆహార పదార్థాల్లోని బయో యాక్టివ్స్ పై పరిశోధకులు అధ్యయనంలో దృష్టి సారించారు. విటమిన్స్, మినరల్స్ మాదిరి కాకుండా.. బయో యాక్టివ్స్ అయిన ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ ఫ్లావనాల్స్ అన్నవి మనుగడ సాగించడానికి తప్పనిసరి అవసరం కాదు. ఒక ఆహారంలో ఎన్నో కాంపౌండ్లు ఉంటాయి. ఉదాహరణకు ఒక కప్పు కాఫీలో ఉండే ఫెనోలిక్ యాసిడ్స్ గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపిస్తాయి. కానీ, కాఫీలో ఉండే ఇతర కాంపౌండ్లు కొలెస్టరాల్ ను పెంచుతాయని పరిశోధకుల అభిప్రాయం. 

దీంతో పరిశోధకులు ఆహార పదార్థాల్లో ఉండే వివిధ భాగాలు ఆరోగ్యంపై చూపించే ప్రభావాన్ని తెలుసుకోవడంపై దృష్టి సారించారు. మెడిటేరియన్ డైట్, నార్డిక్ డైట్ దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉంచుతాయని అర్థం చేసుకోగా.. ఆహార పదార్థాల్లోని కాంపౌండ్ల గురించి మరింత తెలుసుకోవాలని అనుకున్నప్పుడు అందులోని లోపాలు బయటపడ్డాయి. అద్భుతమైన ఆహారం అనుకునేవి కూడా కేవలం చిన్న భాగాలేనని పరిశోధకుల అభిప్రాయం. 

ఆహారానికి మితం అవసరం. ఉదాహరణకు గ్రీన్ టీ ఒకటి రెండు సార్లు తీసుకుంటే నష్టం లేదు. ఎక్కువ సార్లు తీసుకుంటే అందులోని ఫ్లావనాల్స్ కాలేయం దెబ్బతినడానికి కారణం కావచ్చు. కనుక ఈ తరహా ఆహార పదార్థాల నుంచి మెరుగైన ప్రయోజనాలు అందుకునేందుకు వీలుగా సరైన మోతాదును గుర్తించే పనిలో ఉన్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. 

ప్రతి ఒక్కరూ వివిధ రకాల ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు. అందులో కనీస పోషకాలు, ఫైబర్, బయోయాక్టివ్స్ ఉండాలని, వాటితో ఆరోగ్యంగా ఉండొచ్చని పేర్కొన్నారు.

More Telugu News