Qutub Minar: కుతుబ్ మినార్ వద్ద ఆలయ పునరుద్ధరణ కుదరదు: తేల్చి చెప్పిన ఏఎస్ఐ

  • 1914 నుంచి అది సంరక్షణ కట్టడమన్న ఏఎస్ఐ
  • ఆ హోదా ఇచ్చే నాటికి ప్రార్థనలకు ఆధారాల్లేవని స్పష్టీకరణ
  • నిర్మాణాన్ని మార్చడం కుదరదని కోర్టుకు వివరణ
Cant revive temple at a protected monument site ASI on Qutub Minar row

ఢిల్లీలో ప్రసిద్ధ ప్రాచీన కట్టడం కుతుబ్ మినార్ (ఎత్తయిన గోపురం) వద్ద ఆలయ పునరుద్ధరణ సాధ్యం కాదని భారత పురావస్తు పరిశోధన శాఖ (ఏఎస్ఐ) తేల్చి చెప్పింది. ఢిల్లీలోని సాకేత్ కోర్టులో కుతుబ్ మినార్ పై దాఖలైన కేసులో తన స్పందనను తెలియజేసింది. 

‘‘కుతుబ్ మినార్ 1914 నుంచి సంరక్షణ కట్టడంగా ఉంది. ఆ నిర్మాణాన్ని ఇప్పుడు మార్చడం సాధ్యం కాదు. అక్కడ ఆలయాన్ని పునరుద్ధరించడం కుదరదు. సంరక్షణ కట్టడంగా హోదా ఇచ్చే నాటికి అక్కడ పూజలు నిర్వహించిన విధానం ఆచరణలో లేదు’’ అని ఏఎస్ఐ వివరించింది. 

ఏఎస్ఐ మాజీ రీజినల్ డైరెక్టర్ ధరమ్ వీర్ శర్మ ఇటీవలే.. కుతుబ్ మినార్ ను రాజా విక్రమాదిత్య కట్టించినట్టు ప్రకటన చేయడం తెలిసిందే. సూర్యుడిని అధ్యయనం చేయడం కోసం నిర్మించిన సన్ టవర్ గా ఆయన ప్రకటించారు. అందుకు తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. దీంతో కుతుబ్ మినార్ తవ్వకాల నివేదిక ఇవ్వాలని కేంద్ర సాంస్కృతిక శాఖ ఏఎస్ఐ ని ఆదేశించింది. 

దీంతో కుతుబ్ మినార్ కట్టడానికి దక్షిణాన 15 మీటర్ల దూరంలో తవ్వకాలు ప్రారంభించారు. ఈ తవ్వకాలకు సంబంధించిన నివేదికను ఏఎస్ఐ ఇంకా సమర్పించాల్సి ఉంది. 

మరోవైపు కుతుబ్ మినార్ వద్ద ప్రార్థనలు నిర్వహించొద్దంటూ తాజాగా ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారి ఒకరు స్పష్టం చేశారు. కొన్ని నెలల క్రితం ఎప్పుడో దీనిపై ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. కట్టడం చుట్టూ ఉన్న హిందు, జైన ప్రతిమల వివరాలను సమీకరించాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలిపారు. ప్రజల అవగాహన కోసం వాటిని వెలుగులోకి తీసుకురావాలని అనుకుంటున్నట్టు చెప్పారు.

More Telugu News