GVL Narasimha Rao: వైసీపీ రాజకీయ కుతంత్రాలతో ఏపీ ప్రజలకు ఇబ్బందులు: జీవీఎల్ నరసింహారావు

- పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజనపై జీవీఎల్ ట్వీట్
- ఏపీలో ఏప్రిల్, మే నేలల ఉచిత బియ్యం ఇవ్వలేదని ఆరోపణ
- నిధులు విడుదల చేయడం లేదని కేంద్రంపై వైసీపీ నిందలు
- వైసీపీవి రాజకీయ కుతంత్రాలన్న జీవీఎల్
ఏపీలోని వైసీపీ ప్రభుత్వ తీరుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రచిస్తున్న రాజకీయ కుతంత్రాల వల్ల ఏపీలోని 2.68 కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్విట్టర్ వేదికగా వైసీపీపై విమర్శలు గుప్పించారు.
ఏప్రిల్, మే నెలలకు సంబంధించి ఇప్పటివరకు పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద ఉచిత బియ్యం ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని జీవీఎల్ ఆరోపించారు. తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఈ బియ్యానికి సంబంధించిన నిధులను కేంద్రం ఇంకా విడుదల చేయలేదని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన వైసీపీ ప్రభుత్వ పెద్దలపై అసహనం వ్యక్తం చేశారు.