Jagan: సరైన సమయంలో వైద్యం అందించ‌డం చాలా ముఖ్యం: దావోస్‌ ప్రసంగంలో సీఎం జ‌గ‌న్

jagan speech in davos
  • ఏపీలో క‌రోనా నియంత్రణకు కార్యాచరణ అమలు చేశామ‌న్న జ‌గ‌న్
  • ఇటింటి సర్వే చేపట్టామ‌ని వివ‌ర‌ణ‌
  • ఏపీలో భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా వైద్య వ్యవస్థను తీర్చి దిద్దుతున్నట్లు వ్యాఖ్య‌
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ దావోస్ లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో ఫ్యూచర్‌ ఫ్రూఫింగ్‌ హెల్త్‌ సిస్టమ్స్‌ అంశంపై మాట్లాడారు. ఏపీలో అందుతోన్న వైద్య సేవ‌ల గురించి వివ‌రించి చెప్పారు. ఏపీలో క‌రోనా నియంత్రణకు కార్యాచరణ అమలు చేశామ‌ని, ఇటింటికి సర్వే చేపట్టామ‌ని తెలిపారు. క‌రోనా లక్షణాలు కనిపించిన వారిని గుర్తించామ‌ని అన్నారు. 

అలాగే, ఏపీలో ఐసోలేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ విషయంలో వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమ‌ని, ప్ర‌జ‌ల‌కు ఏవైనా వ్యాధులు వస్తే సరైన సమయంలో వైద్యం అందించ‌డం మరో ముఖ్య‌మైన‌ అంశమ‌ని తెలిపారు. ఈ రెండు అంశాల ఆధారంగా ఏపీలో వైద్య వ్య‌వ‌స్థను సిద్ధం చేశామ‌ని చెప్పారు. 

ఏపీలో రెండు వేల జనాభా కలిగిన‌ ఒక గ్రామంలో విలేజ్‌ క్లినిక్‌లను ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. అలాగే, ఏరియా ఆసుప‌త్రులు, జిల్లా ఆసుపత్రులు, టీచింగ్ ఆసుప‌త్రులు చికిత్స అందిస్తాయని చెప్పారు. ఏపీలో భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా వైద్య వ్యవస్థను తీర్చి దిద్దుతున్నట్లు ఆయ‌న వివ‌రించారు. త‌మ‌ ప్రభుత్వం రావడానికి ముందు 11 మెడికల్‌ కాలేజీలు ఉంటే కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు మంజూరు చేశామ‌ని ఆయ‌న తెలిపారు. 

కమ్యూనిటీ హెల్త్‌ ఇన్సురెన్స్ లో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్ పథకాన్ని అమలు చేస్తోందని, ఇందులో వెయ్యికి పైగా అనారోగ్య సమస్యలకు చికిత్స అందిస్తున్నారని అన్నారు. అయితే, అంతకంటే గొప్ప‌గా ఏపీలో వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకం అమలు చేస్తున్నామ‌ని, ఇందులో 2,446 రకాల అనారోగ్య సమస్యలకు చికిత్సలు అందిస్తున్నామ‌ని తెలిపారు.


Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News