Sirpurkar Commission: దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసులో పోలీసుల వాదన నమ్మశక్యంగా లేదన్న సిర్పూర్కర్ కమిషన్

Sirpurkar Commission submits Disha case accused encounter report to Supreme Court
  • 2019లో హైదరాబాదు శివారులో దిశ ఘటన
  • పోలీసుల కాల్పుల్లో నిందితుల మృతి
  • సిర్పూర్కర్ కమిషన్ వేసిన సుప్రీంకోర్టు
  • 387 పేజీలతో నివేదిక అందజేసిన కమిషన్
  • ఎన్ కౌంటర్ బూటకమని పేర్కొన్న వైనం
మూడేళ్ల కిందట తెలంగాణలో దిశ హత్యాచారం కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులు ఎన్ కౌంటర్ లో మరణించగా, నిజాలు నిగ్గుతేల్చేందుకు సుప్రీంకోర్టు జస్టిస్ వీఎస్ సిర్పూర్కర్ కమిషన్ ఏర్పాటు చేసింది. తాజాగా, సిర్పూర్కర్ కమిషన్ 387 పేజీల నివేదికను అత్యున్నత న్యాయస్థానానికి అందజేసింది. ఇందులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. 

దిశ నిందితుల ఎన్ కౌంటర్ కు సంబంధించి పోలీసుల వాదన నమ్మకశ్యంగా లేదని సిర్పూర్కర్ కమిషన్ పేర్కొంది. దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకం అని వివరించింది. దిశ ఘటన పట్ల ప్రజల్లో నెలకొన్న ఆగ్రహావేశాలను చల్లార్చేందుకు, తక్షణ న్యాయం చేశామన్న అభిప్రాయం కలిగించేందుకు నిందితులను కాల్చి చంపినట్టు కమిషన్ వెల్లడించింది. 

నిందితులను కస్టడీలోకి తీసుకున్నప్పటి నుంచి ఉన్న అధికారులు కాకుండా, ఘటన సమయంలో వేరే అధికారులు ఉన్నారని ఆరోపించింది. మొత్తం పది మంది పోలీసులపై విచారణ జరపాలంటూ వారి పేర్లను తన నివేదికలో పొందుపరిచింది. కె.వెంకటేశ్వర్లు, ఆర్.బాలు రాథోడ్, మహ్మద్ సిరాజుద్దీన్, వి.సురేందర్, కొచ్చెర్ల రవి, డి.జానకీరామ్, డి.శ్రీకాంత్, కె.నర్సింహారెడ్డి, షేక్ లాల్ మాధర్, ఎస్.అర్వింద్ గౌడ్ లపై ఐపీసీ 302, రెడ్ విత్ 34, 201, రెడ్ విత్ 302, 34 సెక్షన్లపై విచారణ జరపాలని పేర్కొంది. 

కాగా, సుప్రీంకోర్టు ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. అదే సమయంలో, సిర్పూర్కర్ కమిషన్ నివేదికను బహిర్గతం చేయొద్దన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని కూడా తోసిపుచ్చింది. ఈ నివేదికపై తెలంగాణ హైకోర్టే నిర్ణయం తీసుకుంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
Sirpurkar Commission
Disha
Encounter
Supreme Court
Police
Telangana

More Telugu News