Bengaluru: ఉపాధి కల్పనలో దూసుకుపోతున్న బెంగళూరు!.. తాజా అధ్యయనం వెల్లడి

  • దేశవ్యాప్త ఉపాధిలో 17.6 శాతం వాటా
  • తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, ముంబై
  • భారీ వేతనాలు ఐటీ రంగంలోనే
  • వివరాలను విడుదల చేసిన హైరెక్ట్ సంస్థ
Bengaluru pips Delhi Mumbai to create highest employment shows study

బెంగళూరు నగరం ఉద్యోగులకు స్వర్గధామంగా విలసిల్లుతోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2021-22) ఎక్కువ మందికి ఉపాధి కల్పించిన నగరంగా బెంగళూరు నిలిచిందని పేర్కొంటూ ‘హైరింగ్’ ప్లాట్ ఫామ్ ‘హైరెక్ట్’ సంస్థ అధ్యయనం వివరాలను విడుదల చేసింది. ఢిల్లీ, ముంబై నగరాలను సైతం బెంగళూరు, ఉపాధి కల్పనలో వెనక్కి నెట్టేయడం గమనార్హం.

గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఉపాధి కల్పనలో బెంగళూరు వాటా 17.6 శాతంగా ఉంది. 11.5 శాతంతో ఢిల్లీ, 10.4 శాతంతో ముంబై రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. నోయిడా ఉపాధి కల్పన వాటా 6 శాతంగా ఉంది.

విక్రయాలు (సేల్స్) అండ్ బిజినెస్ డెవలప్ మెంట్ రంగం ఎక్కువ మందికి ఉపాధినిచ్చింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తం ఉద్యోగాల్లో 26.9 శాతం ఈ రంగం నుంచే ఉన్నాయి. ఆ తర్వాత 20.6 శాతం మందికి ఐటీ/ఐటీఈఎస్ రంగం ఉద్యోగాలు కల్పించింది. ఇక అత్యంత తక్కువగా, కేవలం 0.3 శాతం ఉపాధి కల్పించిన రంగంగా ప్రొక్యూర్ మెంట్/ట్రేడ్ నిలిచింది.

ఇక భారీ పారితోషికాలు అందుకుంటున్న వారిలో ఐటీ ఇంజనీర్లే ముందున్నారు. 5-10 ఏళ్ల అనుభవం ఉన్న ఐటీ ఉద్యోగులకు అత్యధిక వేతనాలు లభిస్తున్నాయి. 54.2 శాతం అత్యధిక వేతన ఉద్యోగాలు ఈ రంగం నుంచే ఉన్నాయి. ఆ తర్వాత సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్ మెంట్ 20.4 శాతంతో రెండో స్థానంలో ఉంది. 9.9 శాతంతో మార్కెటింగ్, 9 శాతంతో ఆపరేషన్స్ విభాగాలున్నాయి.

More Telugu News