India: చైనా, పాక్ నుంచి రక్షణకే రష్యా నుంచి భారత్ ఎస్ 400 మిసైళ్ల కొనుగోళ్లు.. పెంటగాన్ రిపోర్ట్

  • జూన్ లో సరిహద్దుల్లో మోహరిస్తుందని వెల్లడి
  • సొంతంగా మిసైల్స్ ను అభివృద్ధి చేసుకుంటోందని వివరణ
  • దేశీయ రక్షణ రంగ పరిశ్రమలను పెంచుతోందని కామెంట్
Pentagon Report On Indias S 400 Missiles Acquisition

రష్యా నుంచి భారత్ ఎస్ 400 క్షిపణులను కొనుగోలు చేయడాన్ని, ఆ దేశంతో ఒప్పందం చేసుకోవడాన్ని అమెరికా ముందు నుంచీ వ్యతిరేకిస్తోంది. ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలంటూ పదే పదే ఒత్తిడి తెస్తోంది. అయినా కూడా భారత్ వెనకడుగు వేయలేదు. తమ సార్వభౌమాధికారానికి తగ్గట్టుగా ఒప్పందాలు చేసుకుంటామని తేల్చి చెప్పింది. గత ఏడాది డిసెంబర్ నుంచే ఆ క్షిపణి వ్యవస్థలు మనకు చేరుతున్నాయి. 

అయితే, తాజాగా ఈ వ్యవహారంపై అమెరికా స్పందించింది. పొరుగున చైనా, పాకిస్థాన్ నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు ఈ ఏడాది జూన్ నాటికి సరిహద్దుల్లో ఆ క్షిపణులను మోహరించేందుకు భారత్ సిద్ధమవుతోందని అమెరికా పెంటగాన్ కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ స్కాట్ బెరియర్.. ప్రభుత్వానికి తెలియజేశారు. గత ఏడాది డిసెంబర్ నుంచే మిసైల్ సిస్టమ్స్ డెలివరీ అవుతున్నాయని పేర్కొన్నారు. 

ఇటీవల నిర్వహించిన ఆర్మ్ డ్ సర్వీసెస్ కమిటీ సమావేశం సందర్భంగా ఆయన భారత్ ఎస్ 400 మిసైల్స్ పై నివేదికను సమర్పించారు. భూ, జల సరిహద్దులను పటిష్ఠ పరచుకునేందుకు భారత్ ఈ మిసైళ్లను సమీకరించుకుంటోందని అందులో పేర్కొన్నారు. అంతేగాకుండా సైబర్ దాడులను తిప్పికొట్టే సామర్థ్యాన్ని పెంచుకుంటోందని వివరించారు. 

దేశీయంగానే హైపర్ సోనిక్, బాలిస్టిక్, క్రూయిజ్, ఎయిర్ డిఫెన్స్ క్షిపణులను తయారు చేసుకునేందుకే భారత్ మొగ్గు చూపుతోందని పేర్కొన్నారు. ఆ దిశగా ఇప్పటికే 2021లో చాలా పరీక్షలను నిర్వహించిందన్నారు. కక్ష్యలోకి ఎన్నెన్నో ఉపగ్రహాలను పంపుతోందన్నారు. అంతరిక్ష ముప్పునూ ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోందని వివరించారు. భూ, వాయు, సముద్ర హద్దులను కాపాడుకునేందుకు వ్యూహాత్మక ఆయుధాలను సిద్ధం చేసుకుంటోందని, న్యూక్లియర్ బలగాలనూ అభివృద్ధి చేసుకుంటోందని వివరించారు. 

2019 నుంచి దేశీయంగా రక్షణ రంగ పరిశ్రమల ఏర్పాటుకు ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. వీలైనంత వరకు విదేశీ దిగుమతులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. రష్యాతో భారత సైనిక సంబంధాలు దృఢంగా ఉన్నాయన్నారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంపై భారత్ తటస్థంగా ఉంటోందని, శాంతి మంత్రాన్నే జపిస్తోందని పేర్కొన్నారు. 

కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడుతూనే పాక్ నుంచి భారత్ లోకి ప్రవేశించే ఉగ్రవాదులకు సరైన రీతిలో జవాబిస్తోందని, పాక్ కూ తగిన సమాధానం చెబుతోందని ఆయన అన్నారు. 2020లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దురాక్రమణలతో భారత్ – చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయన్నారు.

More Telugu News