Indrani Mukerjea: షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జియాకు ఊరట.. బెయిల్ మంజూరు!

  • కూతురి హత్యకేసులో సుప్రీం బెయిల్ మంజూరు 
  • ఇప్పటికే ఆరున్నరేళ్లు జైల్లో గడిపారన్న ధర్మాసనం
  • పీటర్ ముఖర్జియాకు విధించిన షరతులే ఆమెకు కూడా వర్తిస్తాయన్న సుప్రీం
Supreme Court grants bail to Indrani Mukerjea in Sheena Bora murder case

దేశ వ్యాప్తంగా సంచలనాన్ని రేకెత్తించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, ఆమె కన్నతల్లి ఇంద్రాణి ముఖర్జియాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

'ఇంద్రాణి ముఖర్జియా ఇప్పటికే ఆరున్నరేళ్లు కస్టడీలో ఉన్నారు. ఇది చాలా ఎక్కువ సమయం. సందర్భోచిత సాక్ష్యాలపై ఈ కేసు ఆధారపడి ఉంది. కేసు మెరిట్‌లపై మేము వ్యాఖ్యలు చేయడం లేదు. 50 శాతం మంది సాక్షులను ప్రాసిక్యూషన్ అప్పగించినా, విచారణ త్వరగా ముగిసే పరిస్థితి కనిపించడం లేదు. అందువల్ల ఆమెకు బెయిల్ మంజూరు చేస్తున్నాం. ట్రయల్ కోర్టు సంతృప్తి మేరకు ఆమె బెయిల్‌పై విడుదలవుతుంది. పీటర్ ముఖర్జియాకు విధించిన షరతులే ఆమెకు కూడా వర్తిస్తాయి' అంటూ సుప్రీంకోర్టు బెయిర్ ఆర్డర్ లో పేర్కొంది. 

ఇంద్రాణి ముఖర్జియా తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఆరున్నరేళ్లకు పైగా ఆమె జైల్లో ఉన్నారని... గత 11 నెలలుగా విచారణలో ఎలాంటి ప్రగతి లేదని ఆయన అన్నారు. ఇప్పటి వరకు 237 మంది సాక్షులను విచారించారని కోర్టుకు తెలిపారు. ఇప్పటి వరకు ఆమెకు పెరోల్ కూడా లభించలేదని తెలిపారు. ఈ కారణాల నేపథ్యంలో సెక్షన్ 437 కింద ఆమె ప్రత్యేక విడుదలకు అర్హురాలని చెప్పారు. ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. 

తన తొలి భర్త ద్వారా షీనాకు ఇంద్రాణి జన్మనిచ్చింది. 2012లో షీనా బోరా హత్యకు గురయింది. తన డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్, మరో మాజీ భర్త సంజీవ్ ఖన్నాల సాయంతో ఆమెను ఇంద్రాణి హత్య చేసిందని కేసు నమోదయింది. తన మూడో భర్త పీటర్ ముఖర్జియా కుమారుడు (మరో భార్యకు పుట్టిన కొడుకు) రాహుల్ ముఖర్జియాతో షీనా రిలేషన్ షిప్ లో ఉందనే కోపంతో ఆమెను ఇంద్రాణి హత్య చేసిందని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఈ కేసులో పీటర్ ముఖర్జియా కూడా జైలు జీవితాన్ని అనుభవించి బెయిల్ పై విడుదలయ్యారు.

More Telugu News