Elon Musk: నకిలీ ఖాతాల సంఖ్య తేలనిదే ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగదు: ఎలాన్ మస్క్ స్పష్టీకరణ

  • ట్విట్టర్ కొనుగోలుకు మస్క్ ఆఫర్
  • రూ.3.30 లక్షల కోట్లతో డీల్
  • ఫేక్ అకౌంట్లపై స్పష్టత కోరుతున్న మస్క్
  • ట్విట్టర్ నిర్వాహకులు కచ్చితమైన వివరణ ఇవ్వాలంటూ ట్వీట్
Elon Musk seeks exact number of spam accounts in Twitter

అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం, టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ఇటీవల రూ.3.30 లక్షల కోట్లతో ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియ ప్రారంభించి సంచలనం సృష్టించారు. అయితే, ఈ ప్రక్రియ ఇంకా కార్యరూపం దాల్చకపోవడంపై ఎలాన్ మస్క్ స్పందించారు. ట్విట్టర్ లో ఉన్న స్పామ్ ఖాతాల సంఖ్యపై స్పష్టత వస్తేనే ఈ కొనుగోలు ఒప్పందం ముందుకు సాగుతుందని వెల్లడించారు. 

ట్విట్టర్ లో ఉన్న మొత్తం ఖాతాల సంఖ్యలో నకిలీ ఖాతాల సంఖ్య 5 శాతం కంటే తక్కువేనని ట్విట్టర్ నిర్వాహకులు పక్కా ఆధారాలు చూపిస్తేనే తాను కొనుగోలుకు ముందడుగు వేస్తానని మస్క్ తేల్చి చెప్పారు. ట్విట్టర్ ఎస్ఈసీ ఫైలింగ్స్ (సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజి కమిషన్ ఫైలింగ్స్) ఎంత నిక్కచ్చిగా ఉన్నాయన్న దానిపైనే తన ఆఫర్ భవిష్యత్తు ఆధారపడి ఉందని వివరించారు. 

స్పామ్ అకౌంట్లు 5 శాతం కంటే తక్కువ ఉన్నాయని చూపడానికి నిన్న ట్విట్టర్ సీఈవో బహిరంగంగానే నిరాకరించాడని, ఈ ఒప్పందంలో పురోగతి కనిపించాలంటే స్పామ్ ఖాతాలు ఎన్ని ఉన్నాయో వారు చెప్పాల్సిందేనని మస్క్ స్పష్టం చేశారు. ట్విట్టర్ చెబుతున్న దానికంటే నకిలీ ఖాతాల సంఖ్య నాలుగు రెట్లు అధికంగా ఉండొచ్చని భావిస్తున్నామని, బహుశా 20 శాతం స్పామ్ అకౌంట్లే అయ్యుంటాయని మస్క్ ట్వీట్ చేశారు.

More Telugu News