జారుడు బల్ల ఎక్కిన రూపాయి.!
- 77.69 కనిష్ఠ స్థాయి నమోదు
- గత కనిష్ఠం 77.55
- బలహీనంగా చైనా ఆర్థిక డేటా
- మాంద్యంపై ఇన్వెస్టర్లలో భయాలు
చైనా నుంచి వచ్చిన బలహీన ఆర్థిక గణాంకాలు కొత్త ఆందోళనలకు దారితీశాయి. ఇది అంతర్జాతీయ ఆర్థిక మాంద్యానికి దారితీయవచ్చన్న భయాలు నెలకొన్నాయి. ఇది వర్ధమాన దేశాల కరెన్సీలపై ప్రభావం చూపించినట్టు విశ్లేషకులు అంటున్నారు. అమెరికా సైతం మాంద్యానికి సమీపంలో ఉందంటూ విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
మరోవైపు పెరిగిపోయిన కమోడిటీల ధరలతో ద్రవ్యోల్బణం అదుపుతప్పి గరిష్ఠ స్థాయులకు చేరడం తెలిసిందే. ఫలితంగా ఆర్బీఐ సైతం రెండేళ్ల విరామం అనంతరం కీలక రెపో రేటును 0.40 శాతం పెంచింది. యూఎస్ ఫెడ్ కూడా దూకుడుగా రేట్లను పెంచుతూ అధిక ధరలకు కళ్లెం వేసే ప్రయత్నం చేస్తోంది.
వడ్డీ రేట్లు పెరిగే తరుణంలో ఈక్విటీల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ సహజం. ఇలా ప్రతికూల పరిస్థితుల నడుమ భారత మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున నిధులు వెనక్కి తీసుకోవడం కూడా రూపాయిని బలహీనపరుస్తోంది.