Original Choice: 'ఒరిజినల్ చాయిస్' విస్కీ బ్రాండుకు కోర్టులో వ్యతిరేక ఫలితం... వివరాలు ఇవిగో!

  • తక్కువ ధర మద్యంగా ఒరిజనల్ చాయిస్ కు గుర్తింపు
  • గ్రీన్ చాయిస్ పేరిట మరో బ్రాండు 
  • కోర్టుకెక్కిన ఒరిజినల్ చాయిస్ మాతృసంస్థ
  • ఆరోపణలను తోసిపుచ్చిన కోర్టు
Original Choice Whisky brand gets negative decision

మందుబాబులకు బాగా సుపరిచితమైన మద్యం బ్రాండు ఒరిజినల్ చాయిస్. కాస్తంత తక్కువ ధరకే లభ్యమయ్యే ఈ విస్కీ బ్రాండుకు కర్ణాటక కోర్టులో వ్యతిరేక ఫలితం ఎదురైంది. అసలేం జరిగిందంటే... ఎంపీ డిస్టిలరీస్ సంస్థ గ్రీన్ చాయిస్ పేరుతో ఓ బ్రాండును తీసుకువచ్చేందుకు సన్నద్ధమైంది. అందుకు కర్ణాటక రాష్ట్ర ఆబ్కారీ కమిషనర్ అనుమతులు కూడా ఇచ్చారు. 

దీనిపై ఒరిజినల్ చాయిస్ బ్రాండు మాతృసంస్థ జాన్ డిస్టిలరీస్ కోర్టును ఆశ్రయించింది. తమ బ్రాండును కాపీ కొడుతూ గ్రీన్ చాయిస్ పేరిట బ్రాండు తీసుకువస్తున్నారని ఆరోపించింది. దీనిపై తమ అభ్యంతరాలను ఆబ్కారీ కమిషనర్ ఏమాత్రం పట్టించుకోకుండా, అనుమతులు ఇచ్చారని వెల్లడించింది. 

అయితే, కోర్టు ఒరిజినల్ చాయిలస్ మాతృసంస్థ వాదనలతో విభేదించింది. ఇందులో ఆబ్కారీ కమిషనర్ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాదు, ట్రేడ్ మార్కు ఉల్లంఘనల ఆరోపణలను కూడా కోర్టు తోసిపుచ్చింది. తద్వారా గ్రీన్ చాయిస్ మార్కెట్ రంగప్రవేశానికి మార్గం సుగమం చేసింది. ఈ నిర్ణయం ఒరిజినల్ చాయిస్ విస్కీ బ్రాండు తయారీదారు జాన్ డిస్టిలరీస్ కు తీవ్ర నిరాశ కలిగించింది.

More Telugu News