Harley Davidson: భారత్ లో మళ్లీ నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్న హార్లే డేవిడ్సన్

  • రెండేళ్ల కిందట కుదేలైన హార్లే డేవిడ్సన్
  • భారత్ నుంచి నిష్క్రమిస్తున్నట్టు ప్రకటన
  • అంతలోనే మనసు మార్చుకుని హీరోతో భాగస్వామ్యం
  • ఈ ఏడాది 601 బైకులను విక్రయించిన వైనం
Harley Davidson grabs number one position again in India

క్రూయిజర్ బైకుల విభాగంలో ప్రపంచంలోనే అగ్రశ్రేణి సంస్థ హార్లే డేవిడ్సన్. ఈ బ్రాండు పేరు చెబితే చాలు... బైకర్లకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. స్టయిల్, టెక్నాలజీ, వేగం, మన్నిక... ఇలా అనేక అంశాల సమ్మిళితం హార్లే డేవిడ్సన్ మోటార్ సైకిళ్లు. అయితే, గత కొంతకాలంగా భారత్ లో వెనుకబడిన ఈ అమెరికా దిగ్గజం ఇప్పుడు ఊపందుకుంది. భారత్ లో హైఎండ్ క్రూయిజ్ బైకుల సెగ్మెంట్లో కోల్పోయిన అగ్రస్థానాన్ని మళ్లీ చేజిక్కించుకుంది. 

ఇటీవల దేశంలో హార్లే డేవిడ్సన్ బైకుల అమ్మకాలు పుంజుకున్నాయి. కరోనా వ్యాప్తి ప్రభావం, ఇతర మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 2020లో హార్లే డేవిడ్సన్ భారత్ నుంచి నిష్క్రమిస్తున్నట్టు ప్రకటించింది. అయితే  అదే ఏడాది మళ్లీ భారత్ లో కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించి అభిమానులను సంతోషానికి గురిచేసింది. హీరో గ్రూప్ తో చేయి కలిపి భారత్ లో సేవలు అందించనున్నట్టు ఈ సంస్థ వెల్లడించింది. 

పక్కా ప్రణాళికతో పునరాగమనం చేసిన హార్లే డేవిడ్సన్ ఈ ఏడాది భారీ సంఖ్యలో హైఎండ్ బైకులు విక్రయించింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) వెల్లడించిన గణాంకాల ప్రకారం... 2022 ఆర్థిక సంవత్సరంలో హార్లే డేవిడ్సన్ భారత్ లో 601 మోటార్ సైకిళ్లను విక్రయించింది. వీటిలో 531 బైకులు 1000 సీసీ, ఆపై శ్రేణికి చెందినవి. అమ్మకాల పరంగా 37 శాతం వృద్ధి నమోదు చేసింది. 

2021లో హార్లే డేవిడ్సన్ కేవలం 206 ద్విచక్ర వాహనాలనే విక్రయించగలిగింది. అదే సమయంలో ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ ఇండియా (336), కవాసాకి (283), సుజుకి (233) ముందంజ వేశాయి. అయితే, ఈ ఏడాది గణనీయంగా అమ్మకాలు జరిపిన హార్లే డేవిడ్సన్ భారత్ లో హైఎండ్ బైకుల విభాగంలో తానే నెంబర్ వన్ అని చాటుకుంది. ఇటీవల హార్లే డేవిడ్సన్ తీసుకువచ్చిన కొత్త మోడళ్లు పాన్ అమెరికా 1250 అడ్వెంచర్ టూరర్, స్పోర్ట్స్ స్టర్ ఎస్ క్రూయిజర్ బైకులు భారత్ లో అమ్మకాల పెరుగుదలకు దోహదపడ్డాయి.

More Telugu News