Child Marriage: పుట్టినరోజు వేడుకలు అని చెప్పి బాలికకు 35 ఏళ్ల వ్యక్తితో వివాహం!

Child marriage in the pretext of birthday celebrations
  • రంగారెడ్డి జిల్లాలో ఘటన
  • బాలిక వయసు 12 ఏళ్లు
  • బరువు దించుకోవడానికి కుమార్తెకు పెళ్లిచేసిన తల్లిదండ్రులు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన ఐసీడీఎస్ అధికారులు 
దేశంలో బాల్య వివాహాలకు ఇప్పటికీ అడ్డుకట్ట పడడంలేదు. తెలంగాణలో 12 ఏళ్ల బాలికకు 35 ఏళ్ల వ్యక్తితో వివాహం చేశారు. అది కూడా పుట్టినరోజు వేడుకల ముసుగులో ఈ తంతు కానిచ్చారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో ఈ బాల్యవివాహం జరిగింది. 

అమ్మాయికి మైనారిటీ తీరకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఈ విధంగా వ్యవహరించారు. అయితే, ఆ బాలికకు పెళ్లి ఇష్టం లేకపోవడంతో బంధువుల ఇంటికి వెళ్లింది. బాలికను వెదుక్కుంటూ తల్లిదండ్రులు కూడా బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ గొడవ జరగడంతో బాలిక అక్కడ్నించి వెళ్లిపోయింది. 

అయితే, ఈ వ్యవహారం గురించి సమాచారం అందుకున్న ఐసీడీఎస్ అధికారులు బాలికను గుర్తించి ఆశ్రయమిచ్చారు. పుట్టినరోజు వేడుకలు అని చెప్పి తనకు వెళ్లి చేశారని ఆ బాలిక వెల్లడించింది. దాంతో ఐసీడీఎస్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. 

బాల్య వివాహాల నిరోధానికి చట్టం ఉన్నప్పటికీ, చట్టం కళ్లుగప్పి దేశంలో బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయని అనేక నివేదికలు చెబుతున్నాయి. అమ్మాయిల కనీస వివాహ వయసును 21 సంవత్సరాలకు పెంచేందుకు గతేడాది కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం తెలిసిందే.
Child Marriage
Birthday
Ranga Reddy District
Telangana

More Telugu News