Andrew Symonds: ఆస్ట్రేలియా క్రికెట్‌లో మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఆసీస్ దిగ్గజ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ మృతి

Australian Cricket Star Andrew Symonds Dies In Car Crash
  • ఇటీవలే షేన్ వార్న్, రాడ్ మార్ష్ మృతి
  • కారు పల్టీలు కొట్టడంతో మృతి చెందిన సైమండ్స్
  • ఆస్ట్రేలియా తరపున 26 టెస్టులు, 198 వన్డేలు ఆడిన సైమండ్స్
  • జీవితంలో మాయని మచ్చగా ‘మంకీగేట్’ కుంభకోణం
  • సైమండ్స్ మృతి వార్తతో షాక్‌లో క్రికెటర్లు
ఆస్ట్రేలియా క్రికెట్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ఇటీవల ఆ జట్టు మాజీ క్రికెటర్, ప్రపంచ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్, మరో మాజీ క్రికెటర్ రాడ్ మార్ష్ మృతి చెందారు. తాజాగా, ఆ జట్టు మాజీ క్రికెటర్, ఎక్స్‌ప్లోజివ్ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ రోడ్డు ప్రమాదంలో గత రాత్రి ప్రాణాలు కోల్పోయాడు. 46 ఏళ్ల సైమండ్స్ ఆస్ట్రేలియా తరపున 26 టెస్టులు, 198 వన్డేలు ఆడాడు. క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలోని టౌన్స్‌విల్లేలో జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందాడు. 

ప్రమాద సమయంలో కారులో సైమండ్స్ ఒక్కడే ఉన్నాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవింగ్ సీట్లో ఉన్న అతడిని రక్షించే ప్రయత్నం చేశారు. అయితే, కారు బోల్తా పడడంతో తీవ్ర గాయాలపాలైన అతడు అప్పటికే మరణించాడని పోలీసులు తెలిపారు. తొలుత అతడు సైమండ్స్ అని అధికారులు గుర్తించలేకపోయారు. మీడియా సంస్థలు అతడిని సైమండ్స్‌గా గుర్తించాయి. అతడి మృతి వార్త తెలిసిన వెంటనే క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. ఆస్ట్రేలియా క్రికెటర్లు షాక్‌తో ట్వీట్లు చేశారు.

సైమండ్స్ సహచరులైన జాసన్ గిలెస్పీ, ఆడం గిల్‌క్రిస్ట్, పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తదితరులు ట్వీట్లతో తమ బాధను పంచుకున్నారు. సైమండ్స్ మృతి చెందాడన్న వార్తను నమ్మలేకపోతున్నామని, తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు.  

ఆస్ట్రేలియా క్రికెట్‌లో అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా పేరుగాంచిన సైమండ్స్ 2003, 2007 ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడు. అయితే, అతడి క్రికెట్ జీవితంలో ‘మంకీగేట్’ కుంభకోణం మాయని మచ్చలా 2008లో సిడ్నీలో భారత్‌తో జరిగిన న్యూ ఇయర్ టెస్టులో హర్భజన్ సింగ్‌ను ఉద్దేశించి ‘మంకీ’ అని సిమండ్స్ పిలవడం క్రికెట్‌లో పెను దుమారానికి కారణమైంది.

ఆ తర్వాత ఓ సందర్భంలో సైమండ్స్ మాట్లాడుతూ.. మంకీగేట్ కుంభకోణం కారణంగా తాను భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చిందని, తాగుడుకు అలవాటుపడిపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, ఆ తర్వాత హర్భజన్ సింగ్, సిమండ్స్ ఇద్దరూ కలిసి ఐపీఎల్‌లో ఆడారు.
Andrew Symonds
Australia
Cricket
Road Accident

More Telugu News