TRS: నేడు తెలంగాణకు అమిత్ షా.. ప్రశ్నల వర్షం కురిపించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

TRS MLC Kavitha questions Amith Shah Over his tour to Telangana
  • ట్విట్టర్ వేదికగా అమిత్ షాను నిలదీసిన కవిత
  • ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బణానికి ఏమని సమాధానం చెబుతారని ప్రశ్న
  • నిరుద్యోగం, మతపరమైన అల్లర్ల సంగతేంటని నిలదీసిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ
  • ప్రజలను కలిసినప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్న కవిత
‘‘అమిత్ షా జీ, రూ. 3 వేలకు కోట్లకు పైగా ఉన్న ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బణానికి మీరేమని సమాధానం చెబుతారు? నిరుద్యోగం, మతపరమైన అల్లర్లపై ఏమంటారు?’’ అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం కురిపించారు. అమిత్ షా నేడు తెలంగాణ పర్యటనకు రానున్న నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా కవిత పలు ప్రశ్నలు సంధించారు.

బ్యాక్‌వర్డ్ రీజియన్ గ్రాంట్ రూ. 1,350 కోట్లు, జీఎస్టీ పరిహారం రూ. 2,247 కోట్ల సంగతి ఏం చేశారని ప్రశ్నించిన కవిత.. అత్యంత ఖరీదైన ఇంధనం, ఎల్‌పీజీని విక్రయించడంలో భారత్‌ను అగ్రగామి దేశంగా మార్చడంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత ఎనిమిదేళ్లలో తెలంగాణకు ఒక్క ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్‌ఈర్, ట్రిపుల్ ఐటీ, ఎన్ఐ‌డీ, మెడికల్ కాలేజీ, నవోదయ పాఠశాలలను ఇవ్వడంలో కేంద్రం ఎందుకు విఫలమైందో నేడు ప్రజలను కలిసినప్పుడు చెప్పాలని అన్నారు.

మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు రూ. 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్స్ చేసినా కేంద్రం ఎందుకు పట్టించుకోలేదో కూడా తెలంగాణ బిడ్డలకు వివరించి చెప్పాలని కోరారు. కర్ణాటకలోని ఎగు భద్ర నీటిపారుదల ప్రాజెక్టుకు, కెన్ బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించిన కేంద్రం.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు నిరాకరించారో కూడా తెలంగాణ బిడ్డలకు చెప్పాలని అమిత్‌షాను కవిత డిమాండ్ చేశారు.
TRS
K Kavitha
Amit Shah
BJP
Telangana

More Telugu News