Dilsukhnagar: దిల్‌సుఖ్ నగర్ మహిళ హత్య కేసులో సంచలనం.. దారుణ హత్యకు గురైన నిందితుడు సాయితేజ!

 Sai Teja who is Accused in step mother murder case killed by friend
  • ఈ నెల 7న పెంపుడు తల్లి భూదేవి హత్య
  • పెంపుడు కుమారుడి మానసిక స్థితిని ఆసరాగా చేసుకుని హత్యకు పథక రచన
  • సాయితేజను హత్య చేసి అతడి వద్దనున్న రూ. 10 లక్షల నగదు, 35 తులాల బంగారంతో పరారీ
  • భయంతో పోలీసులకు లొంగిపోయిన నిందితుడు శివ
హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్ నగర్‌లో ఈ నెల 7న జరిగిన భూదేవి (58) హత్యకేసులో నిందితుడైన ఆమె పెంపుడు కుమారుడు సాయితేజ (27) దారుణహత్యకు గురికావడం కలకలం రేపుతోంది. సాయితేజను అతడి స్నేహితుడైన శివ రెండు రోజుల క్రితం అమ్రాబాద్ అడవుల్లో హత్యచేశాడు. అయితే, ఆ తర్వాత భయపడిపోయి నిన్న సరూర్ నగర్ పోలీసులకు లొంగిపోయాడు. అతడిచ్చిన సమాచారంతో స్థానిక పోలీసులు, అటవీ శాఖ అధికారుల సాయంతో సాయితేజ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

భూదేవిని హత్య చేసిన తర్వాత శ్రీశైలం పారిపోయిన సాయితేజ, శివ పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు గుండు కొట్టించుకున్నారు. కాగా, సాయితేజ బ్యాగులో ఉండాల్సిన రూ. 10 లక్షల నగదు, 35 తులాల బంగారం కనిపించలేదని పోలీసులు తెలిపారు. సాయితేజ హత్యకు గురైన ప్రాంతమైన అమ్రాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. శివ, సాయితేజ ఈ నెల 10న శ్రీశైలం వెళ్లారు. 

తిరుగు ప్రయాణంలో అమ్రాబాద్ మండలం మల్లెతీర్థం జలపాతం వద్దకు వెళ్లారు. అక్కడ సాయితేజను శివ బండరాయితో మోది హత్య చేశాడు. అనంతరం అతడి వద్దనున్న బ్యాగులోని డబ్బు, బంగారు నగలు తీసుకుని అందులో రాళ్లు నింపి సాయితేజ నడుముకు కట్టి మడుగులో పడేశాడు. హత్య విషయం వెలుగు చూశాక మృతదేహాన్ని వెలికి తీయించిన పోలీసులు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఇక భూదేవి హత్యకు దారితీసిన ఘటనలను ఓసారి పరిశీలిస్తే.. దిల్‌సుఖ్ నగర్‌లోని న్యూ గడ్డి అన్నారం కాలనీకి చెందిన జంగయ్య యాదవ్-భూదేవి భార్యాభర్తలు. సాయితేజ వీరికి దత్తపుత్రుడు. అయితే, అతడి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో వారి ఆస్తిని కొట్టేయాలని సాయితేజ స్నేహితులు పథకం వేశారు. 

ఈ క్రమంలో సాయితేజను పావుగా వాడుకున్న అతడి స్నేహితులు నర్సింహ, సాయిగౌడ్, చింటూ, శివ.. ఈ నెల 7న సాయితేజతో కలిసి భూదేవిని హత్య చేశారు. అనంతరం బంగారం, నగదుతో పరారయ్యారు. దోచుకున్న డబ్బు, బంగారంపై ఆశతో ఆ తర్వాత శివ సాయితేజను హత్యచేశాడు. గురువారం రాత్రి లొంగిపోయిన శివ నుంచి లక్ష రూపాయల నగదు, 22 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Dilsukhnagar
Murder
Hyderabad
Crime News

More Telugu News