Woman: ఏడాదిలోగా మనవడినో, మనవరాలినో ఇస్తారా? లేక రూ.5 కోట్లు పరిహారం చెల్లిస్తారా?: కొడుకు కోడలిని కోర్టుకీడ్చిన మహిళ

Woman Sues Son and Daughter In law For not Conceiving
  • ఎంత చెప్పినా పిల్లలను కనడం లేదని ఆవేదన
  • విసిగి వేసారి కోర్టులో పిటిషన్ వేసిన వైనం
  • తన కొడుకు సంపాదనపై కోడలి కుటుంబ సభ్యుల పెత్తనమంటూ ఆగ్రహం
కన్న కొడుకును, కోడలిని కోర్టుకు లాగిన మహిళ కథ ఇది. డబ్బుల కోసమో.. ఆస్తుల కోసమో కాదు.. తనను చూడడం లేదనీ కాదు.. దాని వెనక మరో బలమైన కారణమే ఉంది. ఎంత మొత్తుకున్నా కొడుకు, కోడలు పిల్లలను కనకపోవడమే ఆమె అంత తీవ్రమైన చర్య తీసుకోవడానికి కారణమైంది. 

అవును, పిల్లలను కనండ్రా బాబు అని చెప్పిచెప్పి విసిగిపోయిన ఆ తల్లి.. ఇక లాభం లేదనుకుని కొడుకు, కోడలిని కోర్టుకీడ్చింది. ‘‘ఏడాదిలోగా మనవడో, మనవరాలినో తన చేతుల్లో పెడతారా? లేక రూ.5 కోట్ల పరిహారం ఇస్తారా?’’ అంటూ వారికి షాక్ ఇచ్చింది. ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో జరిగింది. 

ఎ.కె. శ్రీవాస్తవ అనే న్యాయవాది సహకారంతో ఆమె కోర్టులో పిల్ వేసింది. తన కొడుకు చదువు కోసం ఎంతో కష్టపడ్డానని, ఎంతో ఖర్చు చేసి పైలట్ ను చేశానని తన పిటిషన్ లో పేర్కొంది. 2016లో తన కొడుకుకు పెళ్లి చేశానని, అందుకు భారీగా ఖర్చు చేశానని తెలిపింది. తన డబ్బుతోనే కొడుకు, కోడలిని హనీమూన్ కోసం థాయ్ లాండ్ పంపానని చెప్పింది. 

అయితే, ఆ తర్వాత తన కొడుకును కోడలు హైదరాబాద్ కు తీసుకెళ్లిపోయిందని, అప్పటి నుంచి వారితో తనకు మాటలు లేవని వివరించింది. తన కొడుకు సంపాదనపై కోడలి కుటుంబ సభ్యులే పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపించింది. పిల్లలను కనాలని తాను చెబుతున్నా చెవికెక్కించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కాబట్టి ఏడాదిలోగా ఓ మనవడినో, మనవరాలినో తన చేతుల్లో పెట్టేలా ఆదేశాలివ్వాలంటూ కోర్టును కోరింది. అది కాని పక్షంలో రూ.5 కోట్ల పరిహారం ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది.
Woman
Conceive
Pregnancy
Uttarakhand
Haridwar
Court

More Telugu News