YSRCP: ఎక్కడా గుంతలు కనిపించని విధంగా ఏడాదిలోగా రోడ్లు బాగవ్వాలి!: అధికారుల‌కు జ‌గ‌న్ ఆదేశం

  • ర‌హ‌దారుల‌పై స‌మీక్షించిన ముఖ్యమంత్రి ‌
  • ఆర్అండ్‌బీ రోడ్ల‌కు రూ.2,500 కోట్లు
  • పంచాయ‌తీ రోడ్ల‌కు రూ.1,072.92కోట్లు
  • గుంత‌ల్లేని రోడ్లే ల‌క్ష్యంగా ప‌నిచేయాల‌న్న జ‌గ‌న్‌
ap cm ys jagan reviews road works

ఏపీలో ర‌హ‌దారులు, ఇత‌ర అభివృద్ధి ప‌నుల‌పై స‌మీక్ష సంద‌ర్భంగా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బ‌లు అన్న‌ట్లుగా ప‌ని చేసే ప్ర‌భుత్వంపైనే విమ‌ర్శ‌లు వ‌స్తాయ‌న్న కోణంలో జ‌గ‌న్ వ్యాఖ్య‌లు చేశారు. విప‌క్షాల నుంచి వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ను ఛాలెంజ్‌గా తీసుకుని రాష్ట్రంలో రోడ్ల ప‌రిస్థితిని మెరుగు చేయాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు. ఏడాదిలోగా రాష్ట్రంలో రోడ్ల‌పై గుంత‌లు క‌నిపించ‌ని విధంగా చర్య‌లు తీసుకోవాల‌ని కూడా ఆయ‌న ఆదేశాలు జారీ చేశారు. 

రాష్ట్రంలో ఆర్అండ్‌బీ రోడ్ల కోసం రూ.2,500 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నామ‌ని చెప్పిన జ‌గ‌న్‌.. పంచాయ‌తీరాజ్ రోడ్ల కోసం రూ.1072.92 కోట్ల‌ను వెచ్చిస్తున్నామ‌న్నారు. ప్రతి జిల్లాకు సంబంధించి గ‌తంలో ఏ మేర నిధులు వెచ్చించారు? ఇప్పుడు ఎంత కేటాయిస్తున్నామ‌న్న విషయాల‌ను ప్ర‌జ‌ల ముందు ఉంచాల‌ని ఆయ‌న సూచించారు. 

రాష్ట్రంలో రోడ్లన్నింటినీ బాగు చేసే దిశ‌గా ప్ర‌భుత్వం ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ముందుకు సాగుతోంద‌ని, అందుకోసం ప్ర‌భుత్వం, అధికారులు క‌ష్ట‌ప‌డుతున్నార‌ని తెలిపారు. రోడ్ల నాణ్య‌త విష‌యంలో ఏమాత్రం రాజీ ప‌డ‌వ‌ద్ద‌ని ఆయ‌న అధికారుల‌కు సూచించారు.

More Telugu News