Cricket: నిస్సహాయుడిని అయిపోయా.. తన గోల్డెన్ డకౌట్ లపై విరాట్ కోహ్లీ

Virat Kohli Opens Up On His Golden Duck Out
  • ఆర్సీబీ ఇన్ సైడర్ ఇంటర్వ్యూలో కామెంట్లు
  • రెండోసారి డకౌట్ అయ్యాక తెలిసొచ్చిందన్న కోహ్లీ 
  • నా ఫాం గురించి ఎవరేమన్నా పట్టించుకోనని వ్యాఖ్య 
  • వాళ్లు నా జీవితంలోకి రావాల్సిన అవసరం లేదన్న విరాట్ 
  • అందుకే టీవీని మ్యూట్ చేస్తానంటూ కోహ్లీ వ్యాఖ్య
ఈ ఏడాది ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీ ఫామ్ ఆందోళనకు గురి చేస్తోంది. ఒక అర్ధ సెంచరీ మినహా అతడు చెప్పుకోదగిన ప్రదర్శన చేసింది లేదు. పైగా మూడు గోల్డెన్ డకౌట్ లు అయ్యాడు. ఒక ఐపీఎల్ సీజన్ లో ఎదుర్కొన్న మొదటి బంతికే ఎక్కువ సార్లు వికెట్ సమర్పించుకుని ఏ ఆటగాడికీ లేని చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. మొత్తం ఐపీఎల్ కెరీర్ లో ఆరుసార్లు గోల్డెన్ డకౌట్ అయితే.. ఈ ఒక్క సీజన్ లోనే మూడుండడం గమనార్హం. అయితే, వాటి మీద తనపైనే తాను జోకులు వేసుకున్నాడు కోహ్లీ. ఆర్సీబీ ఇన్ సైడర్ లో భాంగా దానిష్ సాయిత్ తో సంభాషణ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘‘ఫస్ట్ బాల్ డక్స్. రెండో సారి గోల్డెన్ డక్ తర్వాత ఓ నిజం తెలిసొచ్చింది. ఆ సమయంలో ఎలా ఉంటుందో తెలుసుకున్నా. నిస్సహాయుడిని అయిపోయా. నా కెరీర్ లోనే నాకు ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇలాంటివన్నీ ఇప్పుడే చూస్తున్నా’’ అని చెప్పాడు. 

తన ఫాం గురించి నిపుణులు, విమర్శకులు ఏమన్నా పట్టించుకోనని స్పష్టం చేశాడు. అలాంటి బయటి విమర్శలు నా చెవికి తగలకుండా టీవీని మ్యూట్ చేస్తానన్నాడు. ‘‘వాళ్లెవరూ నా జీవితంలోకి రాకూడదు. నా ఫీలింగ్స్ వాళ్లకు అవసరం లేదు. నా జీవితాన్ని వారు లాగించాల్సిన అవసరం లేదు. ఆ క్షణాలను వారు అనుభవించనక్కర్లేదు. అలాంటప్పుడు ఆ అనవసర శబ్దాన్ని ఎలా తుంచేస్తారు? టీవీని మ్యూట్ చేయడమా? లేదా వారి మాటలను పట్టించుకోకపోవడమా? నేను ఆ రెండూ చేస్తాను’’ అని చెప్పుకొచ్చాడు. 

కాగా, ఈ సీజన్ ఐపీఎల్ లో కోహ్లీ 12 మ్యాచ్ లాడి 19.64 సగటుతో 194 పరుగులు చేశాడు. అందులో రెండు గోల్డెన్ డకౌట్ లు సన్ రైజర్స్ హైదరాబాద్ తోనే ఉండడం గమనార్హం. మరొకటి లక్నో సూపర్ జయంట్స్ మ్యాచ్ లో మొదటి బంతికే డకౌట్ అయ్యాడు.      



Cricket
IPL
Virat Kohli

More Telugu News