Kodali Nani: నారాయణపై కక్ష సాధించాల్సిన అవసరం మాకేముంది?: కొడాలి నాని

Kodali Nani fires on TDP leders on Narayana arrest issue
  • నారాయణ అరెస్ట్ నేపథ్యంలో మాటలయుద్ధం
  • భగ్గుమంటున్న టీడీపీ నేతలు
  • తీవ్రంగా స్పందించిన కొడాలి నాని
  • రాజకీయాలకు విద్యార్థులను బలిచేస్తున్నారని ఆగ్రహం
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు నారాయణ అరెస్ట్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. నారాయణపై కక్ష సాధించాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. 

నారాయణ గత మూడేళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారని, ఒకవేళ ఆయన జగన్ కు వ్యతిరేకంగా దూకుడైన రాజకీయాలు ఏమైనా చేస్తున్నాడని మేం టార్గెట్ చేస్తామా? నారాయణ ఏమైనా మాకు వ్యతిరేకంగా యుద్ధాలు నడుపుతున్నాడా... లేదు కదా...! అంటూ కొడాలి నాని వ్యాఖ్యానించారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే ఎవరినైనా ఉపేక్షించేది లేదని అన్నారు. లక్షల మంది పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. 

జగన్ సర్కారుపై బురద చల్లేందుకు పిల్లల భవిష్యత్తును పణంగా పెడుతున్నారని కొడాలి నాని విమర్శించారు. పరీక్ష మొదలైన కాసేపటికి ప్రశ్నాపత్రాలను ఫొటోలు తీసి బయటికి పంపి పేపర్ లీకైందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గు లేకుండా టీడీపీ నేతలు సమర్థించుకుంటున్నారని అన్నారు. జగన్ ను దించడానికి అత్యాచారాలు, హత్యలు, పేపర్ లీకేజీలకు పాల్పడుతున్నారని కొడాలి నాని ఆరోపించారు. మేం ఇవన్నీ చూస్తూ కూర్చోవాలా? అంటూ మండిపడ్డారు. 

"వీళ్లే గుడులు పగలగొట్టి, వీళ్లే ఆందోళనలు చేస్తారు... వీళ్లే మర్డర్లు, మానభంగాలు చేస్తారు... వీళ్లే స్టేట్ మెంట్లు ఇస్తారు. జగన్ ను పదవి నుంచి దించడానికి రేపులు చెయ్యాలా? చేతనైతే జగన్ కంటే మేం ఇంత మంచి చేస్తాం అని ప్రజలకు చెప్పుకోండి. అంతేతప్ప, నీచ రాజకీయాలకు విద్యార్థులను బలిచేయొద్దు" అని హితవు పలికారు.
Kodali Nani
TDP Leaders
Narayana
Paper Leak
CM Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News