CSK: కాన్వే వీరవిహారం... చెన్నై భారీ స్కోరు

  • ఢిల్లీ క్యాపిటల్స్ ముందు భారీ టార్గెట్
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 రన్స్ చేసిన చెన్నై
  • 49 బంతుల్లో 87 పరుగులు చేసిన కాన్వే
  • 7 ఫోర్లు, 5 సిక్సులు బాదిన వైనం
CSK registered 208 runs against Delhi Capitals

ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో ఓపెనర్ డెవాన్ కాన్వే సిక్సర్ల మోత మోగించడంతో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. 49 బంతులు ఎదుర్కొన్న కాన్వే 7 ఫోర్లు, 5 భారీ సిక్సర్ల సాయంతో 87 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సైతం ధాటిగా ఆడాడు. గైక్వాడ్ 33 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 41 పరుగులు చేశాడు. 

వన్ డౌన్ లో వచ్చిన యువ ఆటగాడు శివమ్ దూబే మరింత దూకుడుగా ఆడి 19 బంతుల్లోనే 32 పరుగులు సాధించాడు. అతడి స్కోరులో 2 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. చివర్లో వచ్చిన కెప్టెన్ ధోనీ సైతం బ్యాట్ ఝుళిపించడంతో చెన్నై స్కోరు 200 దాటింది. ధోనీ 8 బంతుల్లోనే 1 ఫోర్, 2 సిక్సులతో 21 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో ఆన్రిచ్ నోర్జే 3 వికెట్లు తీయగా, ఖలీల్ అహ్మద్ 2, మిచెల్ మార్ష్ ఒక వికెట్ పడగొట్టారు.

More Telugu News