SRH: హసరంగ దెబ్బకు చేతులెత్తేసిన సన్ రైజర్స్... వరుసగా నాలుగో ఓటమి

  • నేడు బెంగళూరుతో మ్యాచ్
  • 67 పరుగుల తేడాతో ఓడిన సన్ రైజర్స్
  • 5 వికెట్లు తీసిన హసరంగ
  • 125 పరుగులకు ఆలౌటైన సన్ రైజర్స్
Sunrisers loses again fourth in a row

టోర్నీలో ఓ దశలో మెరుగైన స్థానంలో నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆ తర్వాత అనూహ్యరీతిలో వరుస ఓటములు ఎదుర్కొంటోంది. ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ లోనూ సన్ రైజర్స్ కు పరాజయం తప్పలేదు. బెంగళూరు విసిరిన 193 పరుగుల లక్ష్యఛేదనలో 67 పరుగుల తేడాతో ఓడిపోయింది. హసరంగ 5 వికెట్లతో సన్ రైజర్స్ ను దెబ్బతీశాడు. దాంతో, సన్ రైజర్స్ 19.2 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ అయింది. 

రాహుల్ త్రిపాఠి 37 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 పరుగులు చేయగా, అయిడెన్ మార్ క్రమ్ 21, పూరన్ 19 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. అసలు, సన్ రైజర్స్ ఓటమికి ఆదిలోనే పునాది పడింది. ఓపెనర్ కేన్ విలియమ్సన్ ఒక్క బంతి కూడా ఆడకుండానే రనౌట్ రూపంలో వెనుదిరగ్గా, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (0) మ్యాక్స్ వెల్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. 

హసరంగ బౌలింగ్ కు రావడంతో సన్ రైజర్స్ కష్టాలు రెట్టింపయ్యాయి. క్రీజులో కుదురుకున్న మార్ క్రమ్, పూరన్ లను అవుట్ చేసిన హసరంగ... బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక, జోష్ హేజెల్ వుడ్ కు 2, గ్లెన్ మ్యాక్స్ వెల్ కు 1, హర్షల్ పటేల్ కు 1 వికెట్ లభించాయి.

కాగా, ఈ ఓటమి సన్ రైజర్స్ కు వరుసగా నాలుగోది. ఇప్పటివరకు 11 మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ 6 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. తాజా ఓటమితో సన్ రైజర్స్ ప్లే ఆఫ్ ఆశలు దాదాపు అడుగంటిపోయాయి.

ఇక ముంబయి డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతున్న మరో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. ఈ పోరులో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది.

More Telugu News