North Korea: ఈసారి జలాంతర్గామి నుంచి క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా

  • తగ్గేదే లేదంటున్న ఉత్తర కొరియా
  • వారం రోజుల వ్యవధిలో రెండో క్షిపణి ప్రయోగం
  • ఈ ఏడాది 15వ ప్రయోగం
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న దక్షిణ కొరియా
  • ఉత్తర కొరియా అణు పరీక్షకు సిద్ధమవుతోందని ఆరోపణ
North Korea test fires another projectile

ప్రపంచ దేశాలు ఎవరి పనిలో వారు ఉండగా, కిమ్ జాంగ్ ఉన్ నాయకత్వంలోని ఉత్తర కొరియా తన పని తాను చేసుకుపోతోంది. ఇటీవల కాలంలో భారీ క్షిపణులను పరీక్షిస్తున్న ఉత్తర కొరియా తాజాగా జలాంతర్గామి నుంచి మిస్సైల్ ప్రయోగం చేపట్టింది. ఈ క్షిపణి జపాన్ సముద్రం దిశగా దూసుకెళ్లినట్టు తెలిసింది. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం నిర్వహించిన విషయాన్ని పొరుగుదేశం దక్షిణ కొరియా నిర్ధారించింది. 

ఉత్తర కొరియా వారం రోజుల వ్యవధిలో చేపట్టిన రెండో ప్రయోగం ఇది. దాంతో ఈ ఏడాది ఇప్పటిదాకా 15 ప్రయోగాలు చేపట్టినట్టయింది. దీనిపై దక్షిణ కొరియా ఆందోళన వ్యక్తం చేసింది. ఉత్తర కొరియా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్టే భావిస్తున్నామని, రాబోయే కొన్ని వారాల్లో గానీ, మరో నెలలో గానీ ఉత్తర కొరియా అణు పరీక్ష జరిపే అవకాశాలను కొట్టిపారేయలేమని పేర్కొంది. ఓ అణు కేంద్రంలో పెరిగిన కదలికలే అందుకు నిదర్శనమని చెబుతోంది. 

కాగా, ఉత్తర కొరియా తాజాగా జలాంతర్గామి నుంచి ప్రయోగించిన క్షిపణి బాలిస్టిక్ శ్రేణికి సంబంధించినదా? అది ఎంత దూరం ప్రయాణించింది? వంటి అంశాలను ఇప్పుడే చెప్పలేమని దక్షిణ కొరియా సాయుధ దళాల అధిపతులు పేర్కొన్నారు. దక్షిణ హాంగ్ యాంగ్ ప్రాంతంలోని సిన్ పో జలాల నుంచి ఈ ప్రయోగం జరిగినట్టు తమ దళాలు గుర్తించాయని వివరించారు. అటు, క్షిపణి దూసుకువచ్చిన జపాన్ కోస్ట్ గార్డ్ దళాలు కూడా నిర్ధారించాయి.

More Telugu News