Chandrababu: అధికారం కోసం ఎప్పుడూ వెంపర్లాడలేదు... సీఎం పదవి నాకేం కొత్త కాదు: చంద్రబాబు

Chandrababu held meeting in Kakinada district
  • కాకినాడ జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • టెన్త్ పరీక్షలు నిర్వహించలేని సీఎం అంటూ వ్యాఖ్యలు
  • మూడు రాజధానులు కడతాడంట అని వ్యంగ్యం
  • వైసీపీ వాళ్లకు కూడా బాదుడు తప్పడంలేదని వెల్లడి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నేడు కాకినాడ జిల్లా పర్యటనకు విచ్చేశారు. కాకినాడ పట్టణంలో ప్రత్తిపాడు, తుని అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. టెన్త్ క్లాస్ పరీక్షలు సజావుగా నిర్వహించలేని ఈ ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతాడంట! అంటూ ఎద్దేవా చేశారు. 

తాను ఐటీ ఉద్యోగాల ద్వారా కోట్లు సంపాదించుకునే అవకాశాలు కల్పించానని, కానీ సీఎం జగన్ వాలంటీరు ఉద్యోగాలు ఇచ్చి రూ.5 వేలు విసిరేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీని అన్ని విధాలా భ్రష్టు పట్టించడానికి సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. క్విట్ జగన్... సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదం చేశారు. దేశంలోనే పెట్రో ధరలు మండిపోతున్న రాష్ట్రం ఏపీ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ నుంచి విదేశాలకు గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు పంపే పరిస్థితి నెలకొందని, రాష్ట్ర భవిష్యత్ ను జగన్ అంధకారంలోకి నెట్టేస్తున్నారని విమర్శించారు. 

ఈ పరిస్థితి మారాలంటే ఓ ప్రజా ఉద్యమం తప్పనిసరి అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ఉద్యమాన్ని టీడీపీ ముందుండి నడిపిస్తుందని తెలిపారు. అయితే, తానేమీ అధికారం కోసం వెంపర్లాడే వ్యక్తిని కానని, ముఖ్యమంత్రి పదవి తనకేమీ కొత్త కాదని అన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు నేతలే ముందుండి నడిపించాలని, ప్రజలకు అండగా ఉండాలని తెలిపారు. వైసీపీ వాళ్లు కూడా బాదుడుకు గురవుతున్నారని, ఏపీ పునర్ నిర్మాణానికి వారు కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు.
Chandrababu
TDP
CM Jagan
YSRCP
Kakinada District
Andhra Pradesh

More Telugu News