Shivani Rajasekhar: మిస్ ఇండియా పోటీల్లో తమిళనాడుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజశేఖర్ కుమార్తె... ఎందుకంటే...!

Shivani Rajasekhar clarifies why she represents Tamilnadu in Miss India beauty pageant
  • అందాల పోటీల్లో మిస్ తమిళనాడుగా గెలిచిన శివానీ
  • మూడు ఆప్షన్లు ఎంచుకున్న శివానీ
  • తెలంగాణ, ఏపీతో పాటు తమిళనాడు ఎంచుకున్న వైనం
  • శివానీని తమిళనాడు కేటగిరీలో తీసుకున్న నిర్వాహకులు
ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటున్న హీరో రాజశేఖర్ కుమార్తె శివానీ మరోవైపు అందాల పోటీల్లోనూ పాల్గొంటోంది. ప్రస్తుతం ఆమె మిస్ ఇండియా రేసులో ఉంది. అయితే, శివానీ మిస్ ఇండియా పోటీల్లో తమిళనాడు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. తెలంగాణలో ఉంటూ తమిళనాడుకు ప్రాతినిధ్యం వహించడమేంటన్న సందేహాలపై శివానీ వివరణ ఇచ్చింది. 

వాస్తవానికి తాను తెలంగాణ నుంచే పోటీ పడాలనుకున్నానని, అయితే మిస్ ఇండియా ఆర్గనైజర్లు పలు ఆప్షన్లు ఇవ్వడంతో తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల పేర్లు రాశానని వెల్లడించింది. అయితే, అందాల పోటీల నిర్వాహకులు తనను తమిళనాడు కేటగిరీ కింద పోటీకి పరిగణనలోకి తీసుకున్నారని వివరించింది. 

ఈ క్రమంలోనే తాను మిస్ తమిళనాడు విజేతగా ఎంపికై, మిస్ ఇండియా బ్యూటీ కాంటెస్ట్ కు అర్హత పొందానని శివానీ తెలిపింది. తమిళనాడు తనకు సొంతరాష్ట్రం వంటిదే అయినా, తనను తెలంగాణ, ఏపీ నుంచి ఎంపిక చేసి ఉంటే తెలుగమ్మాయిగా ఎంతో సంతోషించేదాన్నని వెల్లడించింది. ఏదేమైనా తాను భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని గర్వకారణంగా భావిస్తానని పేర్కొంది. 

తన తండ్రి రాజశేఖర్ నటించిన 'శేఖర్' చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో శివానీ కూడా పాల్గొంది. ఈ సందర్భంగానే ఆమె పైవిధంగా స్పందించింది. ఏప్రిల్ 30న తమిళనాడులో అందాల పోటీలు జరగ్గా, శివానీ రాజశేఖర్ మిస్ తమిళనాడుగా ఎంపికైంది. తద్వారా మిస్ ఇండియాకు పోటీపడే 31 మందిలో తానూ ఒకరై నిలిచింది.
Shivani Rajasekhar
Miss India
Tamilnadu
Telangana
Andhra Pradesh
Tollywood

More Telugu News