Hyderabad: పెద్దలను ఎదిరించి పెళ్లాడిన యువతి.. నడిరోడ్డుపై ఆమె భర్తను చంపిన యువతి సోదరుడు

dreaded murder in Hyderabads Saroornagar after young man love Marriage
  • హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో దారుణం
  • ఇనుపరాడ్డుతో యువకుడిని కొట్టి చంపిన వైనం
  • రక్తపు మడుగులో పడివున్న భర్తను చూసి షాక్‌కు గురైన యువతి
  • నిందితుడి అరెస్ట్.. ఆశ్రిన్ ను తమవెంట తీసుకెళ్లిన నాగరాజు కుటుంబ సభ్యులు 
పెద్దలను ఎదిరించి ప్రేమించిన వాడిని పెళ్లాడడమే ఆ యువతి చేసిన పాపమైంది. కుమార్తె చేసిన పనికి అవమాన భారంతో రగిలిపోతున్న కుటుంబ సభ్యులు నిన్న రాత్రి దారుణానికి తెగబడ్డారు. నడిరోడ్డుపై కొత్త దంపతులిద్దరినీ వెంబడించి మరీ యువకుడిని దారుణంగా హతమార్చారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మర్పలికి చెందిన బిల్లాపురం నాగరాజు, మర్పల్లి సమీపంలోని ఘనాపూర్‌కు చెందిన సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసిన ఆశ్రిన్ కుటుంబ సభ్యులు నాగరాజును హెచ్చరించారు. అయితే, ఆశ్రిన్‌నే పెళ్లాడాలని నిర్ణయించుకున్న నాగరాజు హైదరాబాద్ చేరుకుని ఓ కార్ల కంపెనీలో సేల్స్‌మన్‌గా చేరాడు. 

కొత్త సంవత్సరం రోజున ఆశ్రిన్‌ను రహస్యంగా కలుసుకున్న నాగరాజు పెళ్లికి ఒప్పించాడు. దీంతో జనవరి చివరి వారంలో ఆమె ఊరి నుంచి పారిపోయి హైదరాబాద్ చేరుకుంది. అనంతరం జనవరి 31న ఇద్దరూ ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత తనను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండాలన్న ఉద్దేశంతో నాగరాజు వేరే ఉద్యోగంలోకి మారిపోయాడు.

అయితే, వీరు హైదరాబాద్‌లోనే ఉంటున్నట్టు ఆశ్రిన్ కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది. దీంతో నాగరాజు దంపతులు రెండు నెలల క్రితం విశాఖపట్టణం వెళ్లారు. అయితే, తమను ఎవరూ వెంబడించడం లేదని నిర్ధారించుకున్న నాగరాజు, ఆశ్రిన్ ఐదు రోజుల క్రితం తిరిగి హైదరాబాద్ చేరుకుని సరూర్‌నగర్‌లోని పంజా అనిల్‌కుమార్ కాలనీలో ఉంటున్నారు. మరోవైపు, వీరి కోసం గాలిస్తున్న ఆశ్రిన్ కుటుంబ సభ్యులు సరూర్‌నగర్ చేరుకుని మాటు వేశారు.

నిన్న రాత్రి 9 గంటల సమయంలో నాగరాజు, ఆశ్రిన్ కాలనీ నుంచి బయటకు రాగానే యువతి సోదరుడు, అతడి స్నేహితుడు వారిని బైక్‌పై వెంబడించారు. జీహెచ్ఎంసీ కార్యాలయ రహదారిపై వారిని అడ్డుకున్నారు. ఇనుపరాడ్డుతో నాగరాజును విచక్షణ రహితంగా కొట్టి హత్య చేశారు. 

ఈ అనూహ్య ఘటనతో ఆశ్రిన్ షాక్‌కు గురైంది. రక్తపు మడుగులో పడివున్న భర్తను చూసి గుండెలవిసేలా రోదించింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆశ్రిన్‌ సోదరుడిని దుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నాగరాజు కుటుంబ సభ్యులు ఆశ్రిన్‌ను తమతో పాటు తీసుకెళ్లారు.

Hyderabad
Murder
Crime News
Saroornagar

More Telugu News