Cricket: ఊరిస్తున్న రికార్డులు.. ఇవాళ్టి మ్యాచ్ లో ధోనీ వాటిని అందుకుంటాడా!

Will Dhoni Grabs These Record In Today Match with RCB
  • ఇవాళ బెంగళూరుతో చెన్నై మ్యాచ్
  • ఐపీఎల్ లో ధోనీకిది 200వ మ్యాచ్
  • 6 వేల పరుగులకు మరో 6 రన్స్ దూరంలో
  • ఒక జట్టుపై 50 సిక్సర్లకు మరో 4 అడుగుల దూరం
కెప్టెన్ గా, ఆటగాడిగా, వికెట్ కీపర్ గా మహేంద్ర సింగ్ ధోనీ ఎన్నెన్నో రికార్డులను సాధించాడు. టీమిండియాకు ఆడినా.. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను నడిపించినా దిగ్విజయం సాధించాడు. అయితే, ఈ ఏడాది ఐపీఎల్ లో కెప్టెన్ గా తప్పుకొంటున్నానని చెప్పి షాకిచ్చాడు ధోనీ. జడేజా పగ్గాలు అందుకోవడం.. అపజయాల బాటలో జట్టు నడవడం కలవరపరచింది. దీంతో మళ్లీ అతడు జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టాడు. తన మార్కు కెప్టెన్సీని ప్రత్యర్థులకు రుచి చూపించాడు. 

ఈ క్రమంలోనే పలు రికార్డులు మహేంద్రుడిని ఊరిస్తున్నాయి. ఇవాళ సాయంత్రం పూణె వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్ లో చెన్నై తలపడనుంది. మరి, ఆ మ్యాచ్ లో ధోనీ ఆ రికార్డులను అందుకుంటాడా? ఆ రికార్డులేంటో ఓ లుక్కేద్దాం. 

టీ20 మెగా టోర్నీ ఐపీఎల్ లో ధోనీ ఆడబోయే 200వ మ్యాచ్ ఇది. టోర్నీలో ఒకే జట్టుకు 200 మ్యాచ్ లు ఆడిన రెండో ఆటగాడిగా ధోనీ నిలవనున్నాడు. ఈ జాబితాలో బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. పోయిన సీజన్ లోనే విరాట్ 200వ మ్యాచ్ ఆడగా.. ఇవాళ ఆడబోయే మ్యాచ్ 217వది. వాస్తవానికి 2016, 2017లో చెన్నై జట్టుకు ధోనీ దూరమైన సంగతి తెలిసిందే. దీంతో పూణే తరఫున 30 మ్యాచ్ లు ఆడాడు. లేదంటే ఐపీఎల్ లో ఎక్కువ మ్యాచ్ లు ఆడిన ఆటగాడిగా ధోనీనే మొదటి స్థానంలో నిలిచేవాడు. 

ఇక టీ20 (అన్నీ కలిపి) కెప్టెన్ గా ధోనీకిది 302వ మ్యాచ్. ఇప్పటిదాకా సారథిగా ధోనీ 5,994 రన్స్ చేశాడు. 6 వేల పరుగుల మైలురాయికి మరో 6 పరుగుల దూరంలో నిలిచాడు. ఇవాళ ఆ మార్కును అధిగమిస్తే భారత్ తరఫున ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా ధోనీ తన పేరును లిఖించుకోనున్నాడు. ఇప్పటికే విరాట్ కోహ్లీ 6,451 పరుగులతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. 

బెంగళూరుపై ధోనీ ఇప్పటివరకు 836 పరుగులు సాధించాడు. అందులో 46 సిక్సర్లున్నాయి. మరో 4 బాదితే.. బెంగళూరుపై సిక్సర్ల అర్ధశతకాన్ని నమోదు చేసినట్టవుతుంది. ఒక జట్టుపై సిక్సర్ల అర్ధశతకం నమోదు చేసిన తొలి ఆటగాడిగా ధోనీ ఘనతకెక్కుతాడు.

...మరి, మొదటి రికార్డు ఎలాగో అతడి సొంతమైపోతుంది. మిగతా రెండు రికార్డులను ధోనీ అందుకుంటాడో లేదో తెలియాలంటే ఇవాళ సాయంత్రం మ్యాచ్ జరిగే వరకు వేచి చూడాల్సిందే!
Cricket
IPL
MS Dhoni
Chennai Super Kings

More Telugu News