Vishwak Sen: బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చా.. నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది: విష్వక్సేన్

tollywood actor vishwak sens ashoka vanamlo arjuna kalyanam pre release event held in khammam
  • ఖమ్మంలో ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ ప్రీ రిలీజ్ వేడుక
  • ఇటీవలి ఘటనలు తన కుటుంబాన్ని బాధపెట్టాయని విష్వక్సేన్ ఆవేదన
  • అమ్మ నేర్పిన సంస్కారమే తనను మాట్లాడకుండా చేసిందన్న నటుడు
  • ఆకట్టుకున్న ‘పెళ్లి చూపుల’ కార్యక్రమం
  • సినిమాలో కుటుంబం, బంధాల గురించి చక్కని సందేశం ఉందన్న నటి రుక్సార్ థిల్లాన్
ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చిన తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ప్రముఖ నటుడు విష్వక్సేన్ అన్నారు. విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో విష్వక్సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమా ప్రీరిలీజ్ వేడుకను నిన్న సాయంత్రం ఖమ్మం లేక్‌వ్యూ క్లబ్‌లో నిర్వహించారు. 

ఈ సందర్భంగా విష్వక్సేన్ మాట్లాడుతూ.. సినిమాలో అర్జున్ కుమార్ అల్లం పాత్రలో నటించానని, అది అందరికీ నచ్చుతుందని అన్నారు. ఈ నెల 6న థియేటర్లలో కలుసుకుందామని చెప్పారు. ఇక ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు తన కుటుంబాన్ని బాధపెట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అమ్మాయిలకు మర్యాద ఇవ్వనంటూ తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్న  విష్వక్సేన్.. అమ్మ తనకు నేర్పిన సంస్కారమే ఇటీవల జరిగిన ఘటనల్లో తనను మాట్లాడుకుండా చేసిందన్నారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే తాను తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చానని, తనను అణగదొక్కాలని చూస్తున్న వారిని ఎదుర్కొనే ధైర్యం అభిమానులు తనకు ఇచ్చారన్నారు. తాను సినిమాల్లోకి వస్తానని చెప్పినప్పుడు తనను నమ్మిన తొలి వ్యక్తి అమ్మేనని అన్నారు.

నటి రుక్సార్ థిల్లాన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో కుటుంబం, బంధాల గురించి చక్కని సందేశం ఉంటుందని అన్నారు. ఇందులోని తన పాత్ర అందరి అమ్మాయిల జీవితాలను ఆవిష్కరిస్తుందన్నారు. కాగా, కార్యక్రమానికి ముందు విష్వక్సేన్ ‘ప్రియదర్శిని కళాశాల’ విద్యార్థినులతో నిర్వహించిన పెళ్లి చూపుల కార్యక్రమం ఆకట్టుకుంది. ఆ తర్వాత సినిమా బిగ్ టికెట్‌ను నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
Vishwak Sen
Tollywood
Ashoka Vanamlo Arjuna Kalyanam
Khammam
Rukshar Dhillon

More Telugu News