Rajasthan: జోధ్ పూర్ లో మళ్లీ చెలరేగిన ఘర్షణలు.. బీజేపీ ఎమ్మెల్యే ఇంటి ముందు బైక్ దహనం

  • పోలీస్ స్టేషన్ పైకి రాళ్లు రువ్విన ఓ వర్గం
  • సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు
  • గుంపులుగా చేరి నానా బీభత్సం
  • రోడ్డుపై ఎక్కడ చూసినా రాళ్లు
Day After Clashes In Jodhpur Some Pelt Stones at Police Station

రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఉన్న జలోరి గేట్ ఏరియా వద్ద తాజాగా ఘర్షణలు చెలరేగాయి. నిన్న జెండా పెట్టే విషయంలో రెండు వర్గాల మధ్య గొడవలు జరిగి ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. రాళ్లు రువ్వుకుంటూ పరస్పరం ఘర్షణకు దిగాయి. తాజాగా మళ్లీ ఇవాళ అక్కడ గొడవలు జరిగాయి. ఓ వర్గానికి చెందిన కొందరు దుండగులు పోలీస్ స్టేషన్ పై రాళ్లు రువ్వారు. గుంపులుగుంపులుగా చేరి నానా బీభత్సం సృష్టించారు. రోడ్డుపై ఎక్కడ చూసినా రాళ్లే ఉన్నాయి. 

ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే సూర్యకాంత వ్యాస్ ఇంటి ముందు బైకును తగుల బెట్టారు. కాగా, అంతకుముందు కేంద్ర మంత్రి, జోధ్ పూర్ ఎంపీ గజేంద్ర సింగ్ షెకావత్ ఆ ప్రాంతంలో పర్యటించారు. పరిస్థితిని సమీక్షించారు. నిన్న హిందువుల జెండాను తొలగించి ముస్లిం జెండాను పెట్టడం దగ్గర మొదలైన గొడవ చిలికిచిలికి గాలివానలాగా మారిన సంగతి తెలిసిందే. 

స్వాతంత్ర్య సమరయోధుడు బాల ముకుంద్ బిస్సా విగ్రహానికి ఓ బ్యానర్ ను తగిలించి ఈద్ శుభాకాంక్షలు తెలియజేయడం, మైక్ కూడా పెట్టడంతో గొడవ మరింత ముదిరిందని చెబుతున్నారు. ఆ బ్యానర్, జెండాను తొలగించడంతో గొడవ పెద్దదైందని అంటున్నారు.

More Telugu News