Telangana: నిప్పులు చెరుగుతున్న భానుడు.. వడదెబ్బకు తాళలేక తెలంగాణాలో ఐదుగురి మృత్యువాత!

  • మరో నాలుగు రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు
  • ఆదిలాబాద్ జిల్లా భోరజ్‌లో నిన్న 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
  • తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం
High Temperatures in Telangana 5 dead for Heatwaves

తెలంగాణలో భానుడి ప్రతాపం కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో వడదెబ్బకు తాళలేక ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆదిలాబాద్ జిల్లా  బజార్‌హత్నూర్ మండలం రాజులగూడకు చెందిన గుణాజీ అనే ఆరేళ్ల బాలుడు, అదే గ్రామానికి చెందిన ఆర్ఎంపీ బాలాజీ (45) వడదెబ్బకు తాళలేక మరణించారు. అలాగే, బోధ్ మండలంలో ఓ నిర్మాణ కూలి (32), సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఈటూరుకు చెందిన రైతు తిగుళ్ల అంజయ్య (48), యాదాద్రి జిల్లా భవనగిరి మండలం రెడ్డినాయక్ తండాకు చెందిన బుజ్జమ్మ (45) వడదెబ్బతో మృతి చెందారు. 

 కాగా, రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని భోరజ్‌లో నిన్న అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

మరోవైపు, విదర్భ నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు వరకు గాలుల్లో అస్థిరత కొనసాగుతోంది. 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణశాఖ తెలిపింది. అంతేకాదు, వర్షాల సమయంలో 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.

More Telugu News