Uday Express: ఒంగోలు వరకు ‘ఉదయ్’ డబుల్ డెక్కర్ రైలు పొడిగింపు!

  • ప్రస్తుతం వైజాగ్-విజయవాడ మధ్య పరుగులు
  • విజయవాడలో ఆరున్నర గంటలపాటు ఖాళీగానే రైలు
  • ఒంగోలు వరకు పొడిగించాలన్న ప్రతిపాదనకు అధికారుల అంగీకారం!
  • నిర్వహణ నుంచి రెండో రైలు వచ్చాక పొడిగింపు!
Railway Officials green signal to Extend Uday Express to ongole

విశాఖపట్టణం నుంచి విజయవాడ వరకు నడుస్తున్న ఉదయ్ డబుల్ డెక్కర్ రైలును ఒంగోలు వరకు పొడిగించాలని దక్షిణ మధ్య రైల్వే, తూర్పుకోస్తా రైల్వే జోన్లు నిర్ణయించినట్టు తెలుస్తోంది. రైలు విజయవాడ చేరుకున్నాక కొన్ని గంటలపాటు ఖాళీగా ఉంటుండడంతో ఒంగోలు వరకు పొడిగించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఉదయ్ రైళ్లు రెండు నడుస్తుండగా అందులో ఒకటి నిర్వహణకు వెళ్లింది. దీంతో ప్రస్తుతం ఒకటే అటూ ఇటూ తిరుగుతోంది. వచ్చే నెలలో రెండోది కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండడంతో రైలును ఒంగోలు వరకు పొడిగించేందుకు ఆయా జోన్ల ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. 

ఉదయ్ రైలుకు ప్రారంభంలో పది బోగీలు ఉండగా ఆ తర్వాత మూడింటిని తొలగించి ఏడింటితోనే నడుపుతున్నారు. తొలగించిన వాటిని కూడా తిరిగి కలపాలన్న డిమాండ్ కూడా ఉంది. కాగా, అత్యంత రద్దీమార్గమైన విశాఖపట్టణం-విజయవాడ మధ్య పరుగులు తీసే డబుల్ డెక్కర్ రైలులో 80 శాతానికిపైగా ఆక్యుపెన్సీ నమోదవుతోంది. 

తెల్లవారుజామున 5.35 గంటలకు ఈ రైలు విశాఖపట్టణంలో బయలుదేరి 11 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 5.30 గంటలకు విజయవాడలో బయలుదేరి రాత్రి 10.55 గంటలకు విశాఖ చేరుకుంటుంది. అయితే, విజయవాడ చేరుకున్న తర్వాత దాదాపు 6.30 గంటలపాటు రైలు ఖాళీగా ఉంటుండడంతో రైలును పొడిగించాలన్న ప్రతిపాదన వచ్చింది. ఈ నేపథ్యంలో అధికారులు తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

More Telugu News