Shubhman Gill: ఎలాన్ మస్క్... స్విగ్గీని కూడా కొనేసెయ్!: క్రికెటర్ శుభ్ మాన్ గిల్ ట్వీట్

Shubhman Gill tweets Elon Musk to buy Swiggy
  • ఇటీవల ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్
  • కోకాకోలాను కూడా కొనేస్తానంటూ వ్యాఖ్యలు
  • మస్క్ కు సూచన చేసిన గిల్
  • స్విగ్గీ అప్పుడైనా దారికొస్తుందని వెల్లడి
ప్రపంచ వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ ఇటీవల ట్విట్టర్ ను కొనుగోలు చేసి మాంచి ఊపుమీదున్నారు. అదే ఊపులో కోకాకోలా సంస్థను కూడా కొనేస్తానంటూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఎలాన్ మస్క్ ను ఉద్దేశించి టీమిండియా యువ క్రికెటర్ శుభ్ మాన్ గిల్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. 

"ఎలాన్ మస్క్... దయచేసి స్విగ్గీని కూడా కొనేసెయ్! అప్పుడైనా వాళ్లు సకాలంలో డెలివరీ ఇస్తారేమో!" అంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. దేశంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ త్వరగా డెలివరీ ఇవ్వదన్న ఆరోపణలను గిల్ తన ట్వీట్ లో ప్రతిబింబించాడు.

అయితే గిల్ వ్యాఖ్యలకు ఎలాన్ మస్క్ స్పందించకపోయినా, స్విగ్గీ మాత్రం వెంటనే బదులిచ్చింది. "హాయ్ శుభ్ మాన్ గిల్... ట్విట్టర్ సంగతి వదిలేయండి, అది వేరే విషయం... ఒకవేళ మీరు ఆర్డర్ చేసుంటే, దానికి సంబంధించిన విషయాలను నిర్ధారించుకోవాలనుకుంటున్నాం. మీ వివరాలతో మాకు నేరుగా సందేశం పంపండి. ఈ అంశానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పరిశీలిస్తాం" అని స్విగ్గీ కస్టమర్ కేర్ ప్రతినిధి వెల్లడించారు. కాగా, సోషల్ మీడియాలో గిల్ ట్వీట్ కు విశేష స్పందన వస్తోంది.
Shubhman Gill
Elon Musk
Swiggy
Twitter

More Telugu News