Reliance: రూ.19 లక్షల కోట్లకు రిలయన్స్ మార్కెట్ విలువ.. వచ్చే ఏడాది భారీగా పెరగనున్న షేర్ విలువ!

  • ఇవాళ ఒకానొక దశలో రూ.2,827.1ని తాకిన షేర్ విలువ
  • ఏడు సెషన్లలో 11 శాతం వృద్ధి
  • వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.3,975 కు చేరే అవకాశం ఉందన్న మోర్గాన్ స్టాన్లీ
Reliance Marketcap Raised To rs 19 Lakh

దేశంలో అత్యంత విలువైన సంస్థగా పేరుపొందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువలో ఇవాళ రికార్డు సొంతం చేసుకుంది. సంస్థ మార్కెట్ విలువ రూ.19 లక్షల కోట్లను దాటేసింది. ఇవాళ దేశీయ స్టాక్ ఎక్స్ చేంజ్ లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో రిలయన్స్ షేరు విలువ దూసుకెళ్లింది.

బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ ప్రారంభమైన తర్వాత ఉదయం 10.24 గంటలకు షేరు విలువ 1.5 శాతం పెరిగి రూ.2,817 వద్ద ట్రేడ్ అయింది. ఆ తర్వాత కాసేపటికి 1.7 శాతం పెరిగి రూ.2,827.10కి ఎగబాకింది. దీంతో సంస్థ మార్కెట్ విలువలో రికార్డును నమోదు చేసింది. 

గత ఏడు సెషన్లలో సంస్థ షేరు విలువ 11 శాతం పెరిగింది. ఏప్రిల్ లో 8 శాతం వృద్ధి నమోదవగా.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 19 శాతం వరకు షేర్ విలువ పెరిగింది. యూరోపియన్ మార్కెట్లలో ఉన్న కఠిన పరిస్థితులతో సింగపూర్ జీఆర్ఎం (గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్) మార్కెట్లు దూసుకెళ్లడంతో.. ఆ ఎఫెక్ట్ ఇక్కడ కూడా పడింది. మదుపరులు రిలయన్స్ స్టాక్ లను ఎక్కువగా కొన్నారు. 

2023 ఆర్థిక సంవత్సరంలో రిఫైనింగ్ మార్జిన్లు మరింత పెరిగే అవకాశం ఉందని, 2024 ఆర్థిక సంవత్సరానికీ కొనసాగే అవకాశం ఉందన్న నిపుణుల అంచనాలతో మదుపరులు రిలయన్స్ షేర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. 

కాగా, 2023–24 ఆర్థిక సంవత్సరానికిగానూ సంస్థ బ్రోకరేజీ 3 నుంచి 9 శాతానికి పెరిగే అవకాశముందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. దాని ప్రకారం టార్గెట్ షేర్ విలువ రూ.3,170కి చేరే అవకాశం ఉందని అంటున్నారు. వచ్చే ఏడాది నాటికి సంస్థ షేర్ విలువ రూ.3,975కి పెరిగే అవకాశం ఉంటుందని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది.

More Telugu News