Yasir Arafat: ఓ పాకిస్థాన్ క్రికెటర్ కోసం షారుఖ్ ఖాన్ తీవ్రంగా ప్రయత్నించిన వేళ...!

  • ఒక ఐపీఎల్ సీజన్ లో ఆడిన పాక్ ఆటగాళ్లు
  • యాసిర్ అరాఫత్ కోసం బృందాన్ని పంపిన షారుఖ్
  • అంతలోనే ముంబయి పేలుళ్లు
  • ఆ తర్వాత మరెప్పుడూ ఐపీఎల్ ఆడని పాక్ క్రికెటర్లు
When Sharukh Khan offers contract to a Pakistan cricketer

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడడం ప్రపంచ క్రికెటర్ల కల అనడంలో అతిశయోక్తి లేదు. ఐపీఎల్ లో లభించే పారితోషికం, గుర్తింపు క్రికెటర్లను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. అందుకే, దాదాపు అన్నిదేశాల క్రికెటర్లు ఐపీఎల్ బాటపడుతుంటారు. అయితే, పాకిస్థాన్ క్రికెటర్లు మాత్రం కేవలం ప్రారంభ ఎడిషన్ లోనే కనిపించారు. ముంబయి బాంబు పేలుళ్ల ఘటన కారణంగా, పాక్ క్రికెటర్లకు 2008 ఐపీఎల్ చివరిది అయింది. ఈ నేపథ్యంలో, ఓ పాకిస్థానీ క్రికెటర్ కోసం కోల్ కతా నైట్ రైడర్స్ సహ యజమాని షారుఖ్ ఖాన్ తీవ్రంగా ప్రయత్నించిన విషయం తాజాగా వెల్లడైంది. 

ఆ క్రికెటర్ ఎవరో కాదు... పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ యాసిర్ అరాఫత్. షారుఖ్ తన కోసం ప్రయత్నించిన విషయాన్ని అరాఫత్ స్వయంగా వెల్లడించాడు. 

"2008లో నేను ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ లో కెంట్ జట్టు తరఫున ఆడుతున్నాను. ఆ సమయంలో కోల్ కతా నైట్ రైడర్స్ నుంచి ఓ బృందం నన్ను కలిసింది. కోల్ కతా జట్టులో మీరు ఆడాలని షారుఖ్ ఖాన్ కోరుకుంటున్నారు అని వారు నాతో చెప్పారు. అయితే నేను అదో జోక్ అనుకున్నాను. నాకోసం షారుఖ్ ఖాన్ ఓ బృందాన్ని పంపడం ఏంటని భావించాను. అయితే వారు నాకు ఒక కార్డు ఇచ్చారు... ఆ తర్వాత నా ఫోన్ నెంబరు, ఈమెయిల్ వివరాలు తీసుకున్నారు.

కొన్ని వారాల తర్వాత ఓ ఈమెయిల్ వచ్చింది. ఆ మెయిల్ చూస్తే... మీ కోసం వేచిచూస్తున్నాం! మీరు ఇంకా ఎందుకు కాంటాక్ట్ చేయలేదు? అంటూ ఫిర్యాదు చేస్తున్నట్టుగా ఉంది. దాంతో కోల్ కతా జట్టులో ఆడే అంశం మళ్లీ చర్చకు వచ్చింది. వాళ్లు నాకు మూడేళ్ల కాంట్రాక్టు ఆఫర్ చేశారు. అంతేకాదు, షారుఖ్ ఖాన్ నాకు స్వయంగా ఫోన్ చేసి జట్టులోకి ఆహ్వానం పలికారు. 

కానీ అప్పుడే ముంబయి పేలుళ్లు జరిగాయి. దాంతో పాకిస్థాన్ ఆటగాళ్లు ఐపీఎల్ లో ఆడేందుకు వీల్లేకుండా పోయింది. నాకు, ఇతర పాకిస్థాన్ క్రికెటర్లకు అదృష్టం ఆ విధంగా మొహం చాటేసింది. ఆ తర్వాత మేం ఎప్పటికీ ఐపీఎల్ లో ఆడలేకపోయాం" అని యాసిర్ అరాఫత్ వివరించాడు. 

2000 సంవత్సరంలో అరంగేట్రం చేసిన అరాఫత్ పాక్ జట్టు తరఫున 3 టెస్టులు, 11 వన్డేలు, 13 అంతర్జాతీయ టీ20 పోటీలు ఆడాడు. ధాటిగా ఆడే బ్యాట్స్ మన్ గానూ, ఫాస్ట్ మీడియం బౌలర్ గానూ గుర్తింపు పొందాడు. అరాఫత్ 2009లో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు.

More Telugu News