Elons Musk: ఎలాన్ మస్క్ సొంతమైన ట్విట్టర్.. 44 బిలియన్ డాలర్లతో భారీ డీల్

  • ఇది వరకే 9.2 శాతం వాటాను కొనుగోలు చేసిన మస్క్
  • ఒక్కో షేర్‌కు 54.20 డాలర్లు చెల్లించిన ప్రపంచ కుబేరుడు
  • మొత్తంగా 46.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు
  • అభినందనలతోపాటు ప్రశ్నల వర్షం కురిపిస్తున్న యూజర్లు
Elon Musk new owner of Twitter

మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఎట్టకేలకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సొంతమైంది. రెండు వారాల క్రితం ట్విట్టర్‌లోని 9.2 శాతం వాటాను కొనుగోలు చేసిన మస్క్.. తాజాగా సంస్థ మొత్తం షేర్లను కొనుగోలు చేశారు. ఒక్కో షేర్‌కు 54.20 డాలర్ల చొప్పున సంస్థలోని మొత్తం షేర్లను 46.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసి ట్విట్టర్‌ను తన వశం చేసుకున్నారు. 

ఈ సందర్భంగా మస్క్ మాట్లాడుతూ.. వాక్ స్వాతంత్ర్యానికి మరింత అనువైన వేదికగా ట్విట్టర్‌ను తీర్చిదిద్దుతానని ప్రకటించారు. మరోవైపు, ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం వార్తల నేపథ్యంలో నిన్న ట్విట్టర్ షేర్ ధర 3 శాతం పెరిగింది. కాగా, ట్విట్టర్ కొనుగోలుకు అవసరమైన నిధులను బ్యాంకుల ద్వారా మస్క్ సమకూర్చుకున్నట్టు ‘ద వాల్ స్ట్రీట్ జర్నల్’ పేర్కొంది.

ట్విట్టర్‌ను మస్క్ సొంతం చేసుకున్నట్టు తెలియగానే యూజర్లు ఆయనకు కంగ్రాట్స్ చెప్పడంతో పాటు ఆయన శైలిలోనే పలు సరదా ప్రశ్నలు సంధించారు. ‘మస్క్.. నన్ను స్పేస్ నుంచి ట్వీట్ చేయనిస్తారా?’ అని ఒకరు అడిగితే, ‘బ్యాన్ చేసిన ఖాతాల్లో తొలుత మీరు దేనిని పునరుద్ధరిస్తారు?’ అని మరొకరు ప్రశ్నించారు. ట్విట్టర్‌ను ‘హేట్ స్పీచ్’కు వేదికగా మార్చొద్దని ఇంకొకరు కోరారు. ట్విట్టర్ కొనుగోలుకు మస్క్ వెచ్చించిన మొత్తం శ్రీలంక సంక్షోభానికి కారణమైన అప్పుల మొత్తంతో సమానమని మరో యూజర్ కామెంట్ చేశాడు.

  • Loading...

More Telugu News