AP High Court: ఏపీ ధార్మిక పరిషత్ లో సభ్యుల సంఖ్యను కుదించడంపై హైకోర్టు ఆగ్రహం!

High Court proceedings in a petition over AP Dharmika Parishat
  • ధార్మిక పరిషత్ లో నలుగురు సభ్యుల నియామకం
  • 21 మంది సభ్యులు ఉండాలన్న సుప్రీంకోర్టు
  • ప్రభుత్వ నిర్ణయం సుప్రీం తీర్పునకు విరుద్ధమన్న పిటిషనర్
  • తదుపరి విచారణ జూన్ 22కి వాయిదా
ఏపీ ధార్మిక పరిషత్ లో సభ్యుల సంఖ్యను కుదించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ధార్మిక పరిషత్ లో సభ్యుల సంఖ్యను ప్రభుత్వం ఇటీవల నాలుగుకి కుదించింది. ఆ మేరకు దేవాదాయ చట్టానికి సవరణలు చేసింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పాలెపు శ్రీనివాసులు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.

ధార్మిక పరిషత్ లో 21 మంది సభ్యులు ఉండాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని పిటిషనర్ ఆరోపించారు. ధార్మిక పరిషత్ లో కేవలం నలుగురినే సభ్యులుగా నియమించిందని కోర్టుకు వివరించారు. ఆ నలుగురు కూడా అధికారులేనని పిటిషనర్ పేర్కొన్నారు. 

ఈ నేపథ్యంలో, హైకోర్టు నేడు పిటిషన్ ను పరిశీలించింది. ఈ పిటిషన్ ను టీటీడీ దాఖలు చేసిన పిటిషన్లతో కలిపి విచారిస్తామని పేర్కొంది. టీటీడీ పిటిషన్లతో కలిపి విచారించేలా పోస్టింగ్ వేయాలని రిజస్ట్రీకి సూచించింది. పిటిషన్ పై తదుపరి విచారణను జూన్ 22కి వాయిదా వేసింది.
AP High Court
Dharmika Parishat
Members
Petition
Supreme Court
Andhra Pradesh

More Telugu News