Elon Musk: దిగొచ్చిన ట్విట్టర్.. ఎలాన్ మస్క్ తో చర్చలు

  • డీల్ పై చర్చించాలని ట్విట్టర్ బోర్డు నిర్ణయం
  • వాటాదారులతో మస్క్ వరుస సమావేశాలు
  • మద్దతు పొందే ప్రయత్నాలు
  • దీంతో చర్చల మార్గాన్ని ఎంచుకున్న కంపెనీ
Twitter begins negotiations with Elon Musk after Tesla CEO woos shareholders

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలుకు వ్యూహాలు రచిస్తుండడంతో.. ట్విట్టర్ యాజమాన్యానికి ఏమీ పాలు పోవడం లేదు. ఎలాన్ మస్క్ ధన బలం కలిగిన వ్యక్తి కావడం, ట్విట్టర్ లో నూరు శాతం వాటాలు కొనుగోలు చేయడానికి అవసరమైన నిధులకు ఏర్పాట్లు కూడా చేసుకోవడం తెలిసిందే. ఒక్కో షేరుకు 54.20 డాలర్ల చొప్పున చెల్లిస్తానంటూ ఆయన నెల క్రితం ఆఫర్ ప్రకటించారు. అప్పటి నుంచి ట్విట్టర్ బోర్డు మల్లగుల్లాలు పడుతోంది.

ఈ పరిస్థితుల్లో ఎలాన్ మస్క్ తో నేరుగా చర్చించడం ఒక్కటే మార్గమని ట్విట్టర్ బోర్డు భావించనట్టుంది. ఆదివారం ఉదయం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు వెల్లడించాయి. కంపెనీని  ఎలాన్ మస్క్ కు విక్రయించడం సాధ్యమేనా? అన్న అంశాన్ని ట్విట్టర్ బోర్డు పరిశీలిస్తున్నట్టు తెలిపాయి. చర్చలు ప్రారంభించడం అంటే.. మస్క్ ఒక్కో షేరుకు ఆఫర్ చేసిన 54.20 డాలర్ల బిడ్ ను కంపెనీ ఆమోదిస్తున్నట్టు కాదని పేర్కొన్నాయి. 

ఎలాన్ మస్క్ గత కొన్ని రోజులుగా ట్విట్టర్ వాటాదారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తన బిడ్ కు మద్దతు కూడగట్టే పనిని చేపట్టారు. స్వేచ్ఛగా మాట్లాడే వేదికగా ట్విట్టర్ ఉండాలని, ఇందుకోసం అది ప్రైవేటు సంస్థగా మారాలన్న అభిప్రాయాన్ని ఎలాన్ మస్క్ ప్రకటించడం తెలిసిందే. తన బిడ్ కు ట్విట్టర్ ఓకే చెప్పకపోతే, తన దగ్గర ప్లాన్ బీ ఉందని కూడా ఆయన ప్రకటించారు. దీంతో మంచి డీల్ అవకాశాన్ని కాదనుకోవద్దంటూ కొందరు వాటాదారులు కంపెనీని కోరుతుండడం గమనార్హం.

More Telugu News