BJP: 'లవకుశల వారసులం.. హిందూ వాదులం' అంటున్న హార్దిక్ పటేల్!

Patidar Reservations Leader Hardik Patel All Set To Join BJP
  • జోరందుకున్న ఊహాగానాలు
  • బీజేపీపై ఇటీవలి కాలంలో హార్దిక్ ప్రశంసలు
  • కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు
  • ‘హిందూవాదిని’ అంటూ కామెంట్లు
పాటిదార్ రిజర్వేషన్ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్.. హస్తం పార్టీకి హ్యాండివ్వాలని చూస్తున్నారా? కమలం పువ్వుకు స్వాగతం పలకాలనుకుంటున్నారా? ఇన్నాళ్లూ కాంగ్రెస్ లో ఉన్న ఆయన.. తన రాజకీయ దారిని మార్చుకున్నారా? అంటే అవునన్న సమాధానాలే వస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ గుజరాత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఆయన.. బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైందన్న వార్తలు వినిపిస్తున్నాయి. 

తాను బీజేపీతో ఎలాంటి చర్చలు జరపడం లేదని హార్దిక్ నర్మగర్భంగా చెబుతున్నా.. ఆయన సన్నిహిత వర్గాలు మాత్రం బీజేపీలో చేరడం ఖాయమని అంటున్నారు. ‘హిందూవాది’ని అని ఆయన చేసిన వ్యాఖ్యలూ ఇప్పుడు ఆయన బీజేపీలో చేరడం దాదాపు ఖరారైనట్టేనని చెబుతున్నాయి. ఇటు గుజరాత్ లో కాంగ్రెస్ నేతల నిర్ణయాలు బాగా లేవని చెబుతూ.. బీజేపీ విధానాలను హార్దిక్ పటేల్ కొనియాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే హార్దిక్ బీజేపీలోకి వెళతారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. 

అయితే, తాను బీజేపీలోకి వెళుతున్నానన్న వ్యాఖ్యలపై హార్దిక్ పటేల్ స్పందించారు. తాను ఇప్పటిదాకా బీజేపీతో ఎలాంటి చర్చలు జరపలేదన్నారు. అలాంటి నిర్ణయమేదైనా ఉంటే చెబుతానని, గుజరాత్ ప్రజల బాగుకు ఏది మంచిదైతే అదే చేస్తానని చెప్పారు. 

తాను రఘువంశానికి చెందిన వాడినని, లవకుశుల వారసులమని చెప్పారు. రాముడిని పూజిస్తామని, ఈశ్వరుడిని, దేవతలను ఆరాధిస్తామని వివరించారు. హిందూ మత పరిరక్షణకు తాము కావాల్సినదంతా చేస్తున్నామని పేర్కొన్నారు. హిందూగా ఉండడం తనకు గర్వంగా ఉందన్నారు. రాష్ట్రాభివృద్ధిలో బీజేపీ విధానాలు బాగున్నాయని కొనియాడారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వం అసలు బాగాలేదని వ్యాఖ్యానించారు. పార్టీలో ఉన్న నేతల మధ్య భేదాభిప్రాయాలు సహజమేనని, ఉన్న లోపాల గురించి చెబితే పార్టీని వీడుతున్నారనడం సమంజసం కాదని హార్దిక్ చెప్పుకొచ్చారు. కాగా, 2015 నాటి అల్లర్ల కేసులో సుప్రీంకోర్టు హార్దిక్ కు ఊరటనిచ్చింది. ఈ ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు లైన్ క్లియర్ చేసింది.
BJP
Hardik Patel
Gujarath
Patidar
Congress

More Telugu News