Bollywood: పొగాకు ఉత్పత్తుల ప్రచారకర్తగా తప్పుకున్న బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్.. క్షమించమంటూ వేడుకోలు

Akshay Kumar steps down as tobacco brand ambassador after backlash says I am sorry
  • విమల్ పొగాకు బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా అక్షయ్
  • పాన్ మసాలా ప్రచారకర్తలుగా ఇప్పటికే షారూఖ్, అజయ్ దేవగణ్
  • పొగాకు, ఆల్కహాల్‌కు వ్యతిరేకంగా గతంలో అక్షయ్ ప్రచారం
  • షేర్ చేస్తూ తీవ్ర విమర్శలు చేసిన అభిమానులు
ఓ పాన్ మసాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విమర్శలకు తలవంచాడు. ఆ పొగాకు ఉత్పత్తులకు ఇకపై ప్రచారకర్తగా ఉండబోనని ప్రకటించాడు. అంతేకాదు, ప్రజల ప్రాణాలను హరించే ఉత్పత్తులకు ప్రచారం చేసినందుకు అభిమానులకు క్షమాపణలు తెలిపాడు. ఈ మేరకు గత రాత్రి సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

 ఇప్పటికే ఈ జాబితాలో షారూఖ్ ఖాన్, అజయ్ దేవగణ్ ఉండగా, తాజాగా అక్షయ్ కూడా చేరాడు. అయితే, అతడి నిర్ణయాన్ని అభిమానులు హర్షించలేదు. తీవ్రంగా తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో వెనక్కి తగ్గిన అక్షయ్ అభిమానులను ఉద్దేశించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నోట్ విడుదల చేశాడు.

‘‘నన్ను క్షమించండి, అభిమానులకు, శ్రేయోభిలాషులకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. మీ ప్రతిస్పందన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇకపై పొగాకు ఉత్పత్తులకు ప్రచారం చేయబోను. విమల్ ఇలైచీతో నేను జట్టుకట్టడంపై మీరు వెల్లడించిన అభిప్రాయాలను గౌరవిస్తాను. విమల్ ఇలైచీ నుంచి నేను తప్పుకుంటున్నాను. ఇలాంటి విషయాల్లో ఇకపై మరింత అప్రమత్తంగా ఉంటాను’’ అని ఆ నోట్‌లో పేర్కొన్నాడు. 

పాన్ మసాలా బ్రాండ్ ఇటీవలి ప్రకటనలో షారూఖ్ ఖాన్, అజయ్ దేవగణ్‌లు.. ‘విమల్ ప్రపంచం’లోకి అక్షయ్ కుమార్‌ ను స్వాగతిస్తూ కనిపించారు. అందరూ కలిసి సెల్యూట్ చేసి ఇలైచీ నమిలారు. కాగా, అక్షయ్ కుమార్ గతంలో ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. ఇప్పుడు అదే అక్షయ్ పొగాకు బ్రాండ్‌కు అంబాసిడర్‌గా ఉండడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు, గతంలో పొగాకు, ఆల్కహాల్‌కు వ్యతిరేకంగా ఆయన చేసిన ప్రచార వీడియోలను కూడా షేర్ చేశారు. అభిమానుల ఆగ్రహావేశాలతో వెనక్కి తగ్గిన అక్షయ్ సారీ చెబుతూ తన నిర్ణయాన్ని ప్రకటించాడు.
Bollywood
Akshay Kumar
Tobacco
Vimal Elaichi

More Telugu News