Dharmana Prasad: సొంత శాఖపైనే విమర్శనాస్త్రాలు సంధించిన మంత్రి ధర్మాన

  • ఇటీవల ఏపీలో కొత్త క్యాబినెట్
  • రెవెన్యూ శాఖ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు
  • ఏసీబీ నివేదికను ఉటంకించిన మంత్రి
  • తాను తప్పుగా వ్యాఖ్యానించలేదని స్పష్టీకరణ
Dharmana Prasadrao comments on his own ministry

నూతన క్యాబినెట్ కూర్పులో భాగంగా ధర్మాన ప్రసాదరావుకు రెవెన్యూ మంత్రిత్వ శాఖ కేటాయించడం తెలిసిందే. అయితే, రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన సొంత శాఖపైనే విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. రెవెన్యూ శాఖకు వచ్చిన చెడ్డపేరును ఉద్యోగులు సహనంతో పనిచేయడం ద్వారా పోగొట్టాలని పిలుపునిచ్చారు. ఏసీబీ, విజిలెన్స్ నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి లోటుపాట్లు సరిదిద్దుకోవాలన్నారు.

ఆస్తుల రికార్డులు తారుమారు చేస్తున్నారని పేర్కొన్నారు. ఒకరి ఆస్తులను మరొకరి పేర మారుస్తూ రికార్డులు రూపొందిస్తున్నారని, ఇలాగైతే జనాలు చచ్చిపోతారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రెవెన్యూ శాఖపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఏసీబీ నివేదిక చెప్పిందని, ఆ నివేదికలోని విషయాలనే తాను చెబుతున్నానని, అందులో తప్పేముందని అన్నారు. మ్యుటేషన్ కు ఎక్కువ రోజులు పడుతుండడం, డిస్పోజల్స్ ఆలస్యం కావడం వంటి విషయాల్లో సీఎం జగన్ కూడా అసంతృప్తితో ఉన్నారని వెల్లడించారు. 

అయితే రెవెన్యూ శాఖలో అందరూ పనిచేయడం లేదన్నది తన ఉద్దేశం కాదని మంత్రి ధర్మాన వివరణ ఇచ్చారు. మంత్రిగా తాను కూడా రెవెన్యూ శాఖలో భాగమేనని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాలులో ధర్మాన అధికారులతో సమావేశం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News