Haryana: పెరిగిన కరోనా కేసులు.. నాలుగు జిల్లాల్లో మాస్క్ నిబంధనను కఠినతరం చేసిన హర్యానా ప్రభుత్వం!

  • హర్యానాలో నాలుగు జిల్లాల్లో పెరిగిన కేసులు
  • గురుగ్రామ్ లో అత్యధికంగా 198 కేసుల నమోదు
  • ఢిల్లీకి ఆనుకుని ఉన్న గురుగ్రామ్ జిల్లా
Haryana mandates use of face masks in 4 districts

కరోనా కేసులు మళ్లీ స్వలంగా పెరుగుతున్న నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసులు పెరిగిన నాలుగు జిల్లాల్లో ప్రతి ఒక్కరూ మాస్కులు కచ్చితంగా ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. హర్యానాలోని గురుగ్రామ్, ఫరీదాబాద్, సోనిపట్, ఝాజర్ జిల్లాల్లో కొన్ని రోజులుగా కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. నిన్న హర్యానాలో 234 కేసులు నమోదు కాగా... వీటిలో 198 కేసులు గురుగ్రామ్ లో నమోదయ్యాయి. ఫరీదాబాద్ జిల్లాలో 21 కేసులు వచ్చాయి. దీంతో ఆయా జిల్లాలకు సంబంధించి ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. 

ఈ సందర్భంగా హర్యానా అడిషనల్ చీఫ్ సెక్రటరీ (ఆరోగ్యం) మాట్లాడుతూ గురుగ్రామ్ లో కేసులు ఎందుకు పెరుగుతున్నాయనే దానిపై అధ్యయనం చేయాలని ఆదేశించామని... దీనికి సంబంధించిన నివేదిక ఇంకా రావాల్సి ఉందని చెప్పారు. ఈ నాలుగు జిల్లాలు దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉన్నాయని... అందుకే మాస్క్ కచ్చితంగా ధరించాలని చెపుతున్నామని అన్నారు. మాస్క్ ధరించాలనే నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పారు. 

గురుగ్రామ్ లో కేసులు మళ్లీ పెరుగుతుండటానికి ఏ వేరియంట్ కారణం అనే విషయాన్ని తెలుసుకోవడానికి కొన్ని శాంపిల్స్ ను పరీక్షల కోసం రోహ్ తక్ కు పంపించామని తెలిపారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి తాము, తమ సిబ్బంది సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో సరిపడా బెడ్స్, ఆక్సిజన్, వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

More Telugu News