Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్ పై పరువునష్టం దావా!

  • పరువు నష్టం దావా వేసిన మాజీ డిప్యూటీ స్పీకర్ జయరామన్
  • పిటిషన్ ను విచారించిన మద్రాస్ హైకోర్టు బెంచ్
  • తాత్కాలిక స్టే విధించిన హైకోర్టు
Defamation suit on Tamil Nadu CM Stalin

తమిళనాడు సీఎం స్టాలిన్, ఆయన అల్లుడు శబరీశన్ లపై మాజీ డిప్యూటీ స్పీకర్ పొల్లాచ్చి జయరామన్ (అన్నాడీఎంకే) వేసిన పరువు నష్టం కేసును మద్రాస్ హైకోర్టు నిన్న విచారించింది. కేసుపై స్టే విధించింది. 

కేసు వివరాల్లోకి వెళ్తే కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి ప్రాంతంలో మహిళలను, విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురి చేసి, వీడియోలను తీసి బెదిరించిన ఘటనల్లో జయరామన్ కు సంబంధాలు ఉన్నాయంటూ సీఎం స్టాలిన్, శబరీశన్ విమర్శించినట్టు కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. 

ఈ నేపథ్యంలో తన పరువుకు భంగం కలిగించారంటూ జయరామన్ పరువునష్టం దావా వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తుల బెంచ్ తాత్కాలికంగా స్టే విధించింది. తదుపరి విచారణను జూన్ 10వ తేదీకి వాయిదా వేసింది.  

దీనికి ముందు... ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని, కేసు నుంచి తన పేరును తొలగించాలని శబరీశన్ హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నారు. అయితే ఆయన విన్నపాన్ని సింగిల్ జడ్జ్ బెంచ్ తిరస్కరించింది. దీంతో విస్తృత ధర్మాసనానికి ఆయన అప్పీల్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పిటిషన్ ను విచారించిన ద్విసభ్య ధర్మాసనం ఈ అంశానికి సంబంధించి అన్ని రకాల విచారణలపై తాత్కాలిక స్టే విధించింది. 

శబరీశన్ పిటిషన్ పై సింగిల్ బెంచ్ స్పందన ఏమిటంటే?: 
ఈ ఆరోపణలకు సంబంధించి శబరీశన్ కు సంబంధం ఉందా? లేదా? అనేది ఇప్పుడు నిర్ణయించలేము. విచారణ సమయం (ట్రయల్స్)లో మాత్రమే అది తేలుతుంది. జయరామన్ తరపున సీనియర్ న్యాయవాది తీసుకున్న ఆధారాలన్నీ విచారణకు అర్హమైనవే. అందువల్ల శబరీశన్ పిటిషన్ ను తిరస్కరిస్తున్నాం.. అంటూ బెంచ్ పేర్కొంది. 

More Telugu News