Ramya Rao: ఎంపీ సంతోష్ నా భూమిని ఆక్రమించాడు: కేసీఆర్ సోదరుడి కుమార్తె రమ్యారావు ఆరోపణలు

  • 2007లో ఎలగందులలో 2 ఎకరాల భూమిని కొనుగోలు చేశానన్న రమ్యారావు  
  • ఆ భూమిని ఆక్రమించి గ్రానైట్ వ్యర్థాలను నింపుతున్నారని ఆరోపణ 
  • సంతోష్ కు కోకాపేట వంటి ప్రాంతాల్లో 200 ఎకరాలు వున్నాయంటూ వ్యాఖ్యలు 
MP Santhosh occupied my land says KCR brothers daughter Ramya Rao

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువు అయిన జోగినపల్లి సంతోష్ కుమార్ పై కేసీఆర్ సోదరుడి కూతురు రేగులపాటి రమ్యారావు తీవ్ర ఆరోపణలు చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంతోష్ పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడుతున్నాడని అన్నారు. 2007లో ఎలగందులలో తాను 2 ఎకరాల భూమిని కొనుగోలు చేశానని... ఆ భూమిని సంతోష్ ఆక్రమించాడని ఆరోపించారు. ఆ భూమిలో గ్రానైట్ వ్యర్థాలను నింపుతున్నారని చెప్పారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ ఆరోపణలు చేశారు. 

2007లో సంతోష్ ఆస్తులు రూ. 7 కోట్లు అని... 2013లో ఆయన గ్రానైట్ క్వారీ భాగస్వామ్యాన్ని తీసుకున్నారని రమ్య తెలిపారు. 2015లో మిడ్ మానేరు ముంపు బాధితుడిగా 2 గుంటల పట్టా తీసుకున్నారని... ఇప్పుడు కోకాపేట వంటి ప్రాంతాల్లో ఆయనకు 200 ఎకరాల భూమి ఉందని... ఇదంతా ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ మాఫియా సంతోష్ అండదండలతోనే సాగుతోందని రమ్య చెప్పారు. 

సీఎం కేసీఆర్ లక్ష కోట్లు అప్పు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నారని... ఇదే సమయంలో సంతోష్ అండతో కొందరు చెరువులు ఆక్రమిస్తున్నారని విమర్శించారు. ఎలగందులలో కూడా చెరువులు ఆక్రమణకు గురయ్యాయని చెప్పారు. సంతోష్ పై నిజనిర్ధారణ కమిటీ వేసి పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సంతోష్ అక్రమాలపై కేసీఆర్, కేటీఆర్ చర్యలు తీసుకోవాలని అన్నారు. తనకు న్యాయం జరగకపోతే ప్రధాని మోదీని కలిసి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

More Telugu News